వచ్చేది రైతు ప్రభుత్వమే.! ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీయార్ హెచ్చరిక.!

kcr

‘దేశంలో త్వరలో వచ్చేది రైతు ప్రభుత్వమే.. బీజేపీ ముక్త భారత్ నినాదంతో ముందుకు వెళదాం..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో కేసీయార్, షరామామూలుగానే కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తోందనీ, రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామనీ, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు అమలు కావడంలేదని కేసీయార్ చెప్పుకొచ్చారు.

‘దేశవ్యాప్తంగా రైతులు, తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం చేపడుతున్న కార్యక్రమాల్ని అభినందిస్తున్నారు. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని దేశంలోని రైతులందరూ నన్ను అడుగుతున్నారు. ఏం పోదామా జాతీయ రాజకీయాల్లోకి.?’ అంటూ పెద్దపల్లి బహిరంగ సభ సాక్షిగా తెలంగాన సమాజాన్ని అడిగారు కేసీయార్.

అసలు రైతు ప్రభుత్వమంటే ఏంటి.? తెలంగాణలో రైతాంగం బలవన్మరణాలకు పాల్పడటంలేదా.? తెలంగాణలో రైతులు, ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక చర్యల పట్ల ఆందోళన చెందడంలేదా.? అన్నది తెలంగాణలో విపక్షాల వాదన. ప్రధానంగా బీజేపీ సైతం, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇదే విషయమై చాలాకాలంగా నిలదీస్తోంది.

పేరుకే జై జవాన్.. జై కిసాన్ నినాదం.! దేశంలో అదెప్పుడో మూలన పడేయబడ్డ నినాదం. రాజకీయ అవసరాలకు మాత్రమే ఆ నినాదాన్ని రాజకీయ పార్టీలు జపిస్తున్నాయి. కేసీయార్ అయినా, నరేంద్ర మోడీ అయినా.. ఇంకొకరైనా.. కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ వేసి, వ్యవసాయాన్ని అటకెక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి.