వరంగల్లో బయటపడ్డ నకిలీ డాక్టర్ బాగోతం.. పోలీసుల అదుపులో నిందితుడు..!

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు చదువు మీద శ్రద్ధ చూపించకుండా ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ చూపిస్తూ చదువును మధ్యలోనే ఆపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి లక్షల రూపాయల జీతాలు వచ్చే ఉద్యోగాలను పొందుతున్నారు. ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద బిజినెస్ గా మారిపోయింది. ఇలా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం సంపాదించడానికి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు పొందుతున్నారు. అంతేకాకుండా మనిషి ప్రాణాలను కాపాడే కొందరు డాక్టర్లు కూడా నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా చలామణి అవుతూ వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలువలోకి వచ్చాయి. తాజాగా వరంగల్ జిల్లాలో మరొక నకిలీ డాక్టర్ బాగోతం బయటపడింది.

వివరాల్లోకి వెళితే…వరంగల్ నగరానికి చెందిన ముజతాబా అహ్మద్ అనే వ్యక్తి బీ ఫార్మసీ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేశాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఒక డాక్టర్ వద్ద సహాయకుడిగా చేసి కొంతకాలం అక్కడ పనిచేశాడు. తనకు వచ్చే జీతం సరిపోకపోవడంతో అతని కన్ను డాక్టర్ సంపాదన మీద పడింది. ఎలాగైనా తను కూడా డాక్టర్ గా గుర్తింపు పొందాలని భావించి ఎయిమ్స్ నుంచి ఎంబిబిఎస్ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్ సంపాదించాడు. తర్వాత నగరంలోని చింతల్ ప్రాంతంలో 2018లో హెల్త్ కేర్ ఫార్మసీ పేరిట ఒక ఆసుపత్రిని స్థాపించాడు. అతని సహాయకుడిగా సంతోష్ వ్యక్తిని పనిలో పెట్టుకుని తాను నిజమైన డాక్టర్ అని అందరిని నమ్మించాడు.

ఈ క్రమంలో తన వద్దకు వచ్చే పేషెంట్లకు అధిక మొత్తంలో ఫీజు వసూలు చేయడమే కాకుండా అనవసరమైన నిర్ధారణ పరీక్షలు చేయించి మందులు ఇచ్చేవాడు. అంతే చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా పెద్ద హాస్పిటల్స్ కు సిఫార్సు చేస్తూ ఆ హాస్పిటల్స్ నుంచి అధిక మొత్తంలో కమిషన్ అందుకునేవాడు ఇలా నాలుగేళ్లలో ఈ నకిలీ డాక్టర్ బాగా డబ్బు సంపాదించాడు. ఇటీవల ఈ నకిలీ డాక్టర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగి నకిలీ డాక్టర్ ను అదుపులోకి తీసుకోవడమే కాకుండా అతని వద్ద ఉన్న నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు, లాప్టాప్,3 ఫోన్లు, లక్ష రూపాయలకు పైగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు.ఇక 2018 నుండి ఇప్పటివరకు దాదాపు 43 వేల మందికి వైద్యం చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడయ్యింది.