కాపు ఉద్యమాన్ని తలకెత్తుకోమని వంగవీటి రాధాపై రోజు రోజు కి ఒత్తిడి పెరుగుతోందా? ఆ రకంగా కాపు జేఏసీలు పట్టుబడుతు న్నాయా? ఈ వ్యవహారంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దూరుతున్నారా? అంటే అవుననే ఓ కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. కాపు ఉద్యమం నుంచి ముద్రగడ పద్మనాభం తప్పుకున్న తర్వాత ఆ పదవికి ఖాళీ ఏర్పడటం..ఆ ఆఫర్ కాపు సింహం వంగవీటి మోహనరంగ తనయుడైన రాధకు వరించినట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అసలు ఇందులో వాస్తవం ఎంత? నిజంగా ఆయనపై ఒత్తిడి ఉందా? లేదా? అని ఆరాతీస్తే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి.
ప్రస్తుతం రంగ టీడీపీలో ఉన్నారు. కానీ పేరుకే. ఆ పార్టీ పక్షాన ఆయన బలంగా నిలబడటం లేదన్నది అందరికీ తెలిసిందే. వైకాపా మీద కోపంతో టీడీపీ లో చేరారు తప్ప ఆ పార్టీ పై ప్రేమతో అయితే కాదు. ఇదంతా గతం. ప్రస్తుతం పొలిటికల్ గా రాధ పరిస్థితి ఎలా ఉంది అంటే? స్థానికంగా ఆయనకు రాజకీయంగా వచ్చిన ఢోకా లేదన్నది వాస్తవం. ఆయన వెంటే ఓ వర్గమే ఉంది. బెజవాడ రాజకీయాల్లో తండ్రి వేసిన ముద్ర కారణంగా రంగ రాజకీయ భవిష్యత్ కి వచ్చిన నష్టమేమి లేదు. అయితే ఆయనకు బలమైన పార్టీ కావాలి. వైసీపీ నుంచి విబేధించి వచ్చేసారు కాబట్టి మళ్లీ పార్టీలో చేరడం అన్నది దాదాపు అసాధ్యమే. ఇక ప్రత్యామ్నాయంగా రంగ ముందున్న పార్టీలు రెండే రెండు అవి జనసేన-బీజేపీ.
రాధ లాంటి బలమైన నాయకుడు వస్తే పవన్ కళ్యాణ్ ఎర్ర తీవాచీ వేసి మరీ ఆహ్వనిస్తారు. బిజేపీ ఎలాగూ జనసేన మిత్ర పక్షమే. ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఏపీలో బలంగానే ముందుకెళ్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సమస్యలపైనా గట్టిగానే పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాధ సన్నిహిత వర్గాల నుంచి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రాధని కాపు ఉద్యమనాయకుడిగా బాధ్యతలు తీసుకుంటే పూర్తి సహకారం బీజేపీ-జనసేన పార్టీల నుంచి లభిస్తుందని, ఆ తర్వాత పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడానికి ఆ రెండు పార్టీలు వెనుకాడటానికి ఎంత మాత్రం ఆస్కారం లేదని అంటున్నారు. ఇప్పటికే ఆ రెండు పార్టీల నుంచి ఒత్తిడి కూడా మొదలైందని విశ్వసనీయ సమాచారం. ఈ విషయాలన్నింటిని ప్రస్తావిస్తూ కాపు జేఏసీలు కూడా విజయవాడలో రాధతో రహాస్య సమావేశమైనట్లు తెలిసింది. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా రాధతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అత్యంత సన్నిహిత వర్గాల నుంచి లీకైంది.