వైఎస్ జగన్‌కు పిరాయింపుదారుల వెన్నుపోటు ఎలా ఉంటుందో బాగా తెలుసు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాతో జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు వలసలకు తెర తీశారు. అధికారం ఉందని, పదవులు ఉన్నాయని ఆశ చూపించి వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే పని మొదలుపెట్టారు. ఆయన ప్రలోభాలకు జగన్ బృందంలోని ఎమ్మెల్యేలు ఈజీగానే పడిపోయారు. పదవులకు ఆశపడి వైసీపీని వీడిపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ఇది జగన్‌కు తగిలిన అతిపెద్ద వెన్నుపోటు. ఎలాగైనా పిరాయింపు ఎమ్మెల్యేలకు, టీడీపీకి బుద్ది చెప్పాలనుకున్న ఆయన గత ఎన్నికల్లో 151 సీట్లతో విజయం సాధించారు.
జగన్‌కు వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలు దాదాపు అందరూ చిత్తుగా ఓడిపోయి ప్రజెంట్ ఎటూ కాకుండా పోయారు. అలాంటివారిలో చిత్తూరుజిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ఒకరు. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆయన కొన్నిరోజులకే పార్టీని వీడి సైకిల్ ఎక్కారు. ఆశపడినట్టే బాబు ప్రభుత్వంలో మంత్రి పదవి పొంది వైఎస్ జగన్ మీదనే విమర్శలు గుప్పించారు. ఇదే జనానికి నచ్చలేదు. పలమనేరులో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువే. 2014లో జగన్ మాట మేరకు అమర్‌నాథ్‌ను గెలిపించారు. అలా జగన్ హవా మీద గెలిచిన అమర్‌నాథ్ రెడ్డి అదే జగన్ మీద నోరుపారేసుకోవటం జనాలకు నచ్చలేదు.
అందుకే ఏకంగా 32 వేల ఓట్ల తేడాతో ఆయన్ను మట్టికరిపించారు. అధికారం ఉంటే తప్ప ఏమీ చేయలేమనే అభిప్రాయం అమర్‌నాథ్ రెడ్డిది. అందుకే ఇప్పుడు ఏమీ చేయలేకున్నారు. అసలే టీడీపీ కష్టాల్లో ఉంది. పైపెచ్చు పోటీచేసి ఓడిన అమర్‌నాథ్ సైలెంట్ అయిపోయారు. ఆయన తంతు చూసిన తెలుగు తమ్ముళ్లు కావాలనే జగన్ మీద నోరుపారేసుకుని సొంత సామాజికవర్గం ఆగ్రహానికి గురయ్యారు. జంపింగ్ రాజకీయాలు చేసేవారు ఎవరైనా సరే చివరికి వారి పరిస్థితి ఇంతే అనుకుంటున్నారట. ఇలా సొంత సామాజికవర్గానికి, టీడీపీ శ్రేణులకు దూరమైన అమర్‌నాథ్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ఎటూ కాకుండా పోయింది.