జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని.? నో ఛాన్స్.!

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన మీద వస్తోన్న ఆరోపణలపై స్పష్టతనిచ్చారు. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లనే రాజకీయంగా ఎదిగాననీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయబోననీ, ఎప్పటికీ వైసీపీలోనే వుంటానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు.

జనసేనలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోతున్నారంటూ ఓ పుకారు బయల్దేరిన విషయం విదితమే. ఇటీవల మాజీ మంత్రి బాలినేని, కార్యకర్తలు, అనుచరులు, సన్నిహితులతో భేటీ అవడంపై కాస్త రాజకీయ దుమారం చెలరేగిన మాట వాస్తవం. వైసీపీ శ్రేణులే ఒకింత ఆందోళన చెందాయి ఈ వ్యవహారంపై.

అయితే, అది పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఏర్పాటు చేసిన సమావేశం మాత్రమేననీ, పార్టీ పటిష్టత కోసం వైసీపీ ముఖ్య నేతగా తాను చెయ్యాల్సినది తన పరిధిలో చేస్తూనే వుంటానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘పార్టీ నాకు అప్పగించిన బాధ్యతల్ని నిర్వహిస్తున్నానంతే. ఇందులో నా వ్యక్తిగత ఆలోచనలేమీ లేవు..’ అని బాలినేని వెల్లడించారు.

జనసేనలోకే కాదు, ఏ ఇతర రాజకీయ పార్టీలోకీ తాను వెళ్ళబోననీ, వైసీపీలో తాను సంతోషంగానే వున్నాననీ, పదవుల కోసం ఎప్పుడూ తాను రాజకీయాలు చేయలేదనీ, మంత్రి పదవి పోవడంపై దిగులు లేదనీ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రినివాస్ రెడ్డి. దాంతో, ‘బాలినేని జంప్’ అనే ప్రచారానికి తెరపడినట్లయ్యింది.

చేనేతకు మద్దతుగా పవన్ కళ్యాణ్ తనను ట్యాగ్ చేస్తే, తాను స్పందించాననీ, ఇందులో రాజకీయం ఏమీ లేదని బాలినేని చెప్పడం గమనార్హం. అయినా, వైసీపీని వీడి వేరే పార్టీలో చేరేంత పరిస్థితి వైసీపీ నేతలకు ఎందుకు వుంటుంది.? అంత బలమైన స్థాయిలో ఇతర రాజకీయ పార్టీలేమైనా వున్నాయా.? అన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.