Ex Minister Anil : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి వైసీపీ కొంప ముంచేస్తోంది. పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతోందన్న విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తించారు. నెల్లూరు జిల్లాలో అనిల్ రచ్చ కారణంగా వైసీపీ భ్రష్టుపట్టిపోతున్న వైనంపై దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన వైఎస్ జగన్, మంత్రి అనిల్‌ని అమరావతికి పిలిపించుకుంటున్నారట.
ఈరోజు మధ్యాహ్నం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ అవనున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో విభేదాల్ని మానుకోవాలనీ, అందరితో కలిసి పనిచేయాలని అనిల్‌కి ముఖ్యమంత్రి సూచిస్తారట.
అనిల్ మంత్రిగా వున్నప్పుడు కాకాని వర్గం, మంత్రి అనిల్‌కి వ్యతిరేకంగా పని చేసింది. దానికి బదులు తీర్చుకోవాలని మాజీ మంత్రి అనిల్ భావిస్తున్నారు.. మరి, కాకాణి ఇప్పుడు మంత్రి అయ్యారు కదా.? డబుల్ ఇచ్చి తీరాల్సిందేనేమో.! ఆ దిశగానే నెల్లూరు జిల్లాలో వ్యవహారాలు నడుస్తున్నాయి.
మంత్రి పదవులు దక్కడమంటే, సొంత పార్టీలో కొందర్ని ప్రత్యర్థుల్ని చేసుకుని కక్ష సాధింపు చర్యలకు దిగడమేనా.? అన్న చర్చ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరుగుతోందంటే అందుకు కారణం కాకాణి – అనిల్ మధ్య జరుగుతున్న రచ్చే.
పార్టీని కొత్తగా ఉద్ధరించకపోయినా ఫర్వాలేదు, నాశనం చేయకపోతే అదే పది వేలు.. అని వైఎస్ జగన్, పార్టీ నేతలను కోరాల్సిన దుస్థితి దాపురించిందిప్పుడు.