Ex Minister Anil : ‘మేమెవరమైనాసరే, వైఎస్ జగన్ ఫొటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సిందే..’ అంటూ పదే పదే చెబుతుంటారు తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అందులో నిజం లేకపోలేదు. వైసీపీలో ఎవరైనా వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకుని గెలవాల్సిందే. కానీ, నాయకులకూ సొంతంగా ఇమేజ్ వుండి తీరాలి. అలా తమ సొంత బలం మీద కూడా నాయకులకు నమ్మకం వుండాలి.
కానీ, అనిల్ వ్యాఖ్యలు చూస్తేంటే అసలంటూ ఆయనకు సొంత బలం మీద నమ్మకం వున్నట్టు కనిపించడంలేదు. ఆయనకు లేకపోతే లేకపోయింది.. ఇంకెవరికీ సొంత బలం లేదన్నట్టుగా అనిల్ వ్యవహరిస్తే ఎలా.? తాజా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులు అనిల్ విషయంలో ఇక్కడే అసహనానికి గురవుతున్నారు. సీనియర్ పొలిటీషియన్ ఆనం రామనారాయణరెడ్డి కూడా అంతే.
నెల్లూరు జిల్లా వైసీపీలో ప్రస్తుతం అనిల్ ఒంటరి అయిపోయారు. అనిల్ కుమార్ యాదవ్‌ని పక్కన పెట్టి కాకానికి మంత్రి పదవి ఇచ్చారు వైఎస్ జగన్. బొత్సని కొనసాగించినట్లుగా, ఇంకొకర్ని కొనసాగించినట్లుగా అనిల్‌ని జగన్ కొనసాగించలేదంటేనే, ‘మీ సేవలు ఇక చాలు’ అని వైఎస్ జగన్ చెప్పేశారని అర్థమంటూ ఓ ప్రచారం జరుగుతోంది.
అనిల్ కారణంగా వైసీపీకి డ్యామేజీ జరుగుతోంది. విపక్షాల్ని విమర్శించే క్రమంలో అనిల్ అదుపు కోల్పోయారు. పని తక్కువ హడావిడి ఎక్కువైపోయింది. ఈ కారణాలతో అనిల్‌ని వైఎస్ జగన్ పక్కన పెట్టారన్నది ఓపెన్ సీక్రెట్. అయినా అనిల్ ఓవరాక్షన్ తగ్గకపోవడంతో ఆయన్ని పిలిచి క్లాస్ తీసుకున్నారు వైఎస్ జగన్.
ఇంతేనా, ముందు ముందు వైఎస్ జగన్ నుంచి అనిల్ విషయంలో కఠిన నిర్ణయాలు వుంటాయా.? వుండవని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం.