Rosaiah: అజాత శతృవు రోశయ్య.. ‘అందరివాడు’ ఇక లేరు.!

రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే ‘అజాత శతృవు’ అనిపించుకోగలుగుతుంటారు. ఇప్పుడున్న రాజకీయాల్లో అయితే, ‘అజాత శతృవు’ అని ఎవర్నీ అనలేం. రాజకీయాలు అలా మారిపోయాయంతే. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య.. ‘అజాత శతృవు’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం. ‘అందరివాడు’ అని అన్ని పార్టీలకు చెందిన నాయకులతోనూ అనిపించుకున్న రోశయ్య ఇక లేరు.

మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా.. ఇలా రోశయ్య అందించిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ పదవిలో వున్నాసరే, ఆయన మీద పెద్దగా విమర్శలు వచ్చేవి కాదు. ‘సర్దుబాటు’ చేయడంలో రోశయ్య తర్వాతే ఎవరైనా.. అని చెబుతుంటారు ఇప్పటికీ.

అందుకేనేమో, ఆర్థిక మంత్రిగా ఆయనది ఎప్పటికీ ఎవరూ చెరిపేయలేని రికార్డు. వరుసగా ఏడుసార్లు.. మొత్తంగా దాదాపు 15 సార్లు రోశయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారంటే.. ఆయన సమర్థత ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. వృద్ధాప్యం కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని ఆయన గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నారు.

అయితే, తనను కలిసేందుకు వచ్చేవారిని ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాల్ని వారితో పంచుకుంటూ వచ్చారు రోశయ్య. రోశయ్యను కలిసేవారు, ఆయన రాజకీయాల్లో సాధించిన విజయాలు, రాజకీయాల పట్ల ఆయనకున్న అవగాహన వంటివాటిని తెలుసుకుని, వాటిని గుర్తు చేసుకుని మురిసిపోతుంటారు.

‘రాజకీయాల్లో విమర్శలు సహజం. రోశయ్యపైనా ఒకటీ అరా సందర్భాల్లో విమర్శలు చేయాల్సి వచ్చిందేమో. కానీ, ఆయన ఏనాడూ ఆ విమర్శల్ని సీరియస్‌గా తీసుకోలేదు. కొత్తవారిని ప్రోత్సహించేవారు. చిరునవ్వుతో పలకరించేవారు..’ అంటూ రోశయ్యతో తమ అనుబంధాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు.