ఈటెల రాజేందర్ కష్టపడుతున్నా.. పట్టించుకునేవారేరీ.?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్, హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం నానా తంటాలూ పడాల్సి వస్తోంది. అసలంటూ ఉప ఎన్నికకు సంబంధించి అదికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది మొదలు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వేడి రాజేసేందుకు ఈటెల రాజేందర్ పడరాని పాట్లూ పడుతున్నారు. పాదయాత్ర ఇటీవలే ప్రారంభించిన ఈటెల, బీజేపీ శ్రేణుల్ని కలుపుకుపోవడంలో విఫలమవుతున్నట్లే కనిపిస్తోంది. ఈటెలకు బీజేపీ అధిష్టానం నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. కానీ, రాష్ట్ర బీజేపీ నాయకత్వం.. ఈటెల విషయంలో అందించాల్సిన రీతిలో సహకారం అందించడంలేదన్న విమర్శలున్నాయి. బీజేపీ నేతగా ఈటెల, హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగబోతున్నప్పటికీ, ఎన్నికల పోరు మాత్రం.. ఈటెల వర్సెస్ తెలంగాణ రాష్ట్ర సమితి.. అన్నట్టుగానే జరగనుంది.

తెలంగాణ ప్రభుత్వాన్ని ఈటెల మాత్రమే ఢీకొంటున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. కాగా, హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరికొత్త పథకాల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అమల్లోకి తెస్తున్నారు. ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందన్నదానిపై అధికార పార్టీ వద్ద ఖచ్చితమైన సమాచారం వుందనీ, ఈ విషయమై ఈటెల కొంత అయోమయంలో వున్నారనీ అంటున్నారు. తనకు రాష్ట్ర బీజేపీ నుంచి అందుతున్న సహకారం మరింత పెరగాల్సి వుందని ఈటెల బీజేపీ అధిష్టాన పెద్దల వద్ద వాపోతున్నారట. దుబ్బాక తరహాలో పని చేస్తే తప్ప, తెలంగాణ రాష్ట్ర సమితికి హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ధీటైన సమాధానం ఇవ్వలేమన్న భావనలో ఈటెల వున్నారు. కానీ, ఎందుకో బీజేపీ నుంచి హుజూరాబాద్ విషయమై అంత జోరు కనిపించడంలేదు. రాష్ట్ర బీజేపీ గనుక హుజూరాబాద్ ఉప ఎన్నికను లైట్ తీసుకుంటే, ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోనుందన్నది నిర్వివాదాంశం.