బీజేపీలో ఈటెల చేరికతో గులాబీ పార్టీకి ముల్లు గుచ్చుకున్నట్టేనా.?

Etela To Join BJP, Master Stroke To TRS

Etela To Join BJP, Master Stroke To TRS

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ద్వారా ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపారు.. ఆయనతో కలిసి ఢిల్లీకి వెళ్ళారు కూడా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మంతనాల అనంతరం బీజేపీలో ఈటెల చేరికపై అధికారిక ప్రకటన రానుంది. కాగా, ఇది నిజంగానే తెలంగాణ రాష్ట్ర సమితికి మాస్టర్ స్ట్రోక్ కాబోతోందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పటిదాకా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో చేరడం తప్ప, గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలెవరూ ఇతర పార్టీల్లోకి జంప్ చేయలేదు.. గడచిన ఏడేళ్ళుగా నడుస్తున్న ఈక్వేషన్ ఇది.

ఈటెల రూపంలో గులాబీ పార్టీ అనే పడవకి తొలి చిల్లు పడిందని చెప్పుకోవచ్చేమో. అయితే, ఈటెలను వదిలించుకునేందుకు గులాబీ బాస్.. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తొలుత మంత్రి పదవి పీకేశారు. ఈ క్రమంలో ఆయన మీద నానా రకాల ఆరోపణలూ చేయించారు. ఈ పరిస్థితుల్లో ఈటెల ముందున్న బెస్ట్ ఆప్షన్ బీజేపీ మాత్రమే. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ తనకు అండగా నిలిస్తే, రాష్ట్రంలో గులాబీ పార్టీ నుంచి ఎదురయ్యే రాజకీయ దాడిని తాను ధీటుగా ఎదుర్కోగలనన్న నమ్మకం కలిగిన తర్వాతనే బీజేపీ వైపు అడుగులేశారు ఈ మాజీ మంత్రి. ఇప్పటికే బీజేపీలో పలువురు సీనియర్ నాయకులున్నారు.. వారికి అదనంగా ఇప్పుడు ఈటెల వచ్చి చేరుతున్నారు. దాంతో తెలంగాణ రాజకీయాల్లో ముందు ముందు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. చూద్దాం.. ఏం జరుగుతుందో.