ఈటెల రాజేందర్ గెలిచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంపై తన పట్టు తగ్గలేదని నిరూపించారు. సిట్టింగ్ స్థానాన్ని ఆయన నిలబెట్టుకోగా, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి పరాభవం ఎదురయ్యింది. మరీ గొప్ప మెజార్టీ ఏం కాదుగానీ, అధికార పార్టీని ఓడించడమంటే చిన్న విషయం కాదు. అలా ఈటెల, ‘జెయింట్ కిల్లర్’ అనే పేరు తెచ్చేసుకున్నారు.
అధికార పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీ చేసినా, ముఖ్యమంత్రి కేసీయార్ స్వయంగా పోటీ చేసినట్లు హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు హడావిడి చేశాయి. ఓటుకి 6 వేల నుంచి 20 వేల రూపాయలదాకా హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన మాట వాస్తవం.
‘అబ్బే, అదంతా దుష్ప్రచారం’ అని గులాబీ నాయకులు కొట్టి పారేయచ్చుగాక.. ఆ నోట్లు అందుకున్న జనాలైతే అబద్ధాలు చెప్పరు కదా.? వందల కోట్లు గుమ్మరించేశారంటూ హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈటెల రాజేందర్, గులాబీ పార్టీపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు చూసుకుంటే, మధ్యలో రెండు రౌండ్లు తప్ప, మొత్తం అన్ని రౌండ్లలోనూ ఈటెల రాజేందర్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. గులాబీ పార్టీ అంచనా వేసుకున్న చోట్ల కూడా ఈటెల రాజేందర్ సత్తా చాటడం గమనార్హం.
దీన్ని బీజేపీ విజయం అనాలా.? ఈటెల విజయం అనాలా.? అంటూ కమలం పార్టీలో చిచ్చు పెట్టేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నా.. ఇది నిఖార్సైన విజయం.. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సాధించిన విజయం.. అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.
అదే సమయంలో, గులాబీ పరాజయం కాదు.. కేసీయార్ పరాజయం.. అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి హరీష్ రావు పరాజయం.. అని కూడా అంటున్నారు. మరిప్పుడెలా.? ఈ డ్యామేజీని కేసీయార్ కంట్రోల్ చేసుకునేదెలా.? కష్టమే సుమీ.