Telangana: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది మంత్రి ఈటెల రాజేందర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ‘వేటు’ వ్యవహారం. ముందే అన్నీ ఆలోచించుకుని, వేటు వేసేసి.. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు నడిపిస్తున్నారంటూ అధికార పార్టీ పెద్దల మీద ఈటెల రాజేందర్ అసహనం వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే. ‘నేను న్యాయంగా హేచరీస్ వ్యాపారం చేస్తున్నా.
ప్రభుత్వం నుంచి పైసా రాయితీ కూడా పొందలేదు. కానీ, కొంతమంది 100 శాతం రాయితీలు పొంది, కోట్లు గడించేశారు. వారందరి గురించీ నేనిప్పుడు మాట్లాడను. అది నా సబ్జెక్ట్ కాదు..’ అని నిన్నే ఈటెల రాజేందర్ హింట్ ఇచ్చిన విషయం విదితమే. నేడు మరింత కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్న దరిమిలా, ఈటెల రాజేందర్ గులాబీ దొరల గుట్టు రట్టు చేసేందుకు అత్యంత సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘నా దగ్గర చాలామంది దొరల చిట్టా వుంది. అది ఖచ్చితంగా అవసరమైనప్పుడు విప్పి చూపిస్తా..’ అని ఈటెల తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట.
మరోపక్క, ఈటెల దగ్గర వున్న ఆ సమాచారం కోసం, కాంగ్రెస్ పార్టీతోపాటు, బీజేపీ నేతలూ తెగ ప్రయత్నాలు షురూ చేశారు. ఈటెల రాజేందర్ తమ పార్టీలోకి వస్తారంటూ ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఇప్పటికే చెప్పేసుకుంటున్నాయి. మరోపక్క, కేసీఆర్ వ్యతిరేకులందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొస్తానంటూ ప్రొఫెసర్ కోదండరామ్ ముందుకొస్తున్నారు. కాగా, సోమవారం ఈటెల రాజేందర్, రాజకీయంగా తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. వివిద పార్టీల నుంచి తనకు ఆహ్వానం వున్నా, ఆయన వేచి చూసే ధోరణి అవలంబించబోతున్నారట సోమవారం వరకు.