Etela: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత ఈటెల రాజేందర్, కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీలోనే తనకు విరోధులు పెరిగిపోయిన నేపథ్యంలో ఆయన తప్పించుకునేందుకు అవకాశమే లేకుండా పోయింది. ప్రధానంగా అధికార పార్టీ అనుకూల మీడియా, ఈటెల రాజేందర్ ని టార్గెట్ చేయడమంటే, అది గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనుమతి లేకుండా సాధ్యమయ్యే వ్యవహారమే కాదు. ఆరోపణలు వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు.
కేసీఆర్ ఆదేశించాక, విచారణ ఎంత వేగవంతంగా ప్రారంభమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విచారణ షురూ అయ్యింది, ఈటెల రాజేందర్ కి చెందిన జమున హేచరీస్, అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించేశారు కూడా. ఈటెల కుటుంబ సభ్యులకు చెందిన జమున హేచరీస్ వున్న భూముల్లో అసైన్డ్ భూములు వున్నాయని అధికారులు తేల్చి చెప్పారు. వీలైనంత త్వరగా నివేదిక ముఖ్యమంత్రికి అందజేస్తామని కూడా అధికారులు అంటున్నారు. అంటే, సాయంత్రానికే పూర్తిస్థాయి నివేదిక, ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరబోతోందన్నమాట. అదే జరిగితే, రాత్రికి రాత్రి కఠిన నిర్ణయాలు కేసీఆర్ తీసుకోక తప్పదన్నమాట.
నిజానికి, కీలక నిర్ణయం తీసుకున్నాకే.. ఈ కథ మొదలైందన్న వాదనా లేకపోలేదు. మరోపక్క, ఈటెలకు మద్దతుగా ఆయన అభిమానులు ఆందోళనలు షురూ చేశారు. అదే సమయంలో, వివిధ పార్టీల నుంచి ఈటెలకు సంఘీభావం వచ్చి పడుతోంది. ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ నేత శ్రవణ్ అలాగే బీజేపీ నేతలు కొందరు, ఈటెల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నారు. ఈటెలను బయటకు పంపేందుకు నిర్ణయం తీసుకున్న కేసీఆర్, ఆయన్ని ఇరికించారన్నది విపక్షాల విమర్శ. ఎలా చూసినా, ఈటెల ఈ వివాదం నుంచి తప్పించుకునేలా లేరు. రేపో మాపో ఆయన పదవి ఊడటం ఖాయంగానే కనిపిస్తోంది.