ఇప్పుడిక అధికారికం.. ఈటెల రాజేందర్ ఇకపై మాజీ తెలంగాణ రాష్ట్ర సమితి నేత.. ఇక నుంచి ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం కారణంగా మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్, ఇటీవలే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. ఆ వెంటనే ఆయన రాజీనామాకు ఆమోదం లభించడం తెలిసిన విషయాలే. ‘తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ.. ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుల సొంతం..’ అంటూ మొన్నామధ్యన ఈటెల చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర సమితిలో దుమారం రేగింది.
ఈటెల చేసిన వ్యాఖ్యల్ని కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. అప్నటినుంచీ ఆయన మీద ప్రత్యేక నిఘా పెట్టించారు. భూ కబ్జా ఆరోపణల్ని సాకుగా చూపి, అత్యంత వ్యూహాత్మకంగా కేసీఆర్, ఈటెలను మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఇదంతా జరిగిపోయిన కథ. ఇప్పడిక ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరగానే, తెలంగాణ రాష్ట్ర సమితిపై విమర్శల తీవ్రత పెంచారు.
పార్టీ ఫిరాయింపుల గురించి గతంలో నీతులు చెప్పిన కేసీఆర్, తెలంగాణ వచ్చాక.. పూర్తి మెజార్టీ వున్నా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారని ఎద్దేవా చేశారు. పార్టీలో ప్రజాస్వామ్యం వుండకూడదని భావించే వ్యక్తి కేసీఆర్.. అంటూ మండిపడ్డారు ఈటెల రాజేందర్. తన మీద అడ్డగోలుగా అసత్య ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశారంటూ కేసీఆర్ మీద తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు ఈటెల. బీజేపీలో చేరడం ఆనందంగా వుందనీ, తెలంగాణ రాష్ట్ర సమితి పతనం కోసం పనిచేస్తాననీ, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి తనవంతు పాత్ర పోషిస్తానని ఈటెల చెప్పుకొచ్చారు.