Employees Strike : సమ్మె ముంచుకొస్తోంది.. జగన్ సర్కార్ ఏం చేస్తుంది.?

Employees Strike : ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ‘తగ్గేదే లే’ అంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ధోరణితో కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె అనివార్యంగానే కనిపిస్తున్న దరిమిలా, సమ్మె ప్రారంభమైతే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్నదానిపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది సాధారణ ప్రజానీకంలో.

కొత్త పీఆర్సీ ఈ మొత్తం వివాదానికి కారణం. జగన్ సర్కారు ప్రకటించిన కొత్త పీఆర్సీ దెబ్బకి తమ వేతనాలు తగ్గిపోయాయని ఉద్యోగులు వాపోతున్నారు. ‘అబ్బే, అదేం లేదు.. ఎవరికి రూపాయి కూడా జీతం తగ్దదు.. జీతాలు అందరికీ పెరుగుతాయ్..’ అని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం పంతానికి పోయింది.. తాను అనుకున్నట్టుగానే కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు సిద్ధం చేసింది.

అయితే, కొత్త వేతనాలకు సంబంధించిన పే స్లిప్పుల్ని ఉద్యోగులు మంటల్లో వేసి కాల్చేశారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులకీ – ప్రభుత్వానికీ మధ్య నెలకొన్న కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలేవీ సఫలం కావడంలేదు.

పీఆర్సీ విషయంలో తగ్గేది లేదని ప్రభుత్వం చెబుతోంటే, పీఆర్సీ జీవోని వెనక్కి తీసుకోవాలన్నది ఉద్యోగుల డిమాండ్. పాత జీతాలే కావాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ మెట్టుదిగే పరిస్థితి కనిపించని దరిమిలా, సమ్మె గనుక జరిగితే.. రాష్ట్రంలో తీవ్ర గందరగోళమే నెలకొంటుంది.

ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటే, ప్రభుత్వ వైద్యులూ సమ్మె బాట పడితే ఏంటి పరిస్థితి.?