Employees Agitation : నో డౌట్, ఉద్యోగుల్లేకపోతే ప్రభుత్వాలు లేవు. ఎవరు అధికారంలో వున్నా, వారికి ఉద్యోగులు సహకరించాల్సిందే.. సహకరిస్తారు కూడా. కానీ, ఉద్యోగుల్ని సరిగ్గా చూసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైతే.? ఉద్యోగులు అసంతృప్తికి గురై, సరిగ్గా పని చేయకపోతే.. పాలనా వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది.
ఉద్యోగులు వేరు, రాజకీయం వేరు.. అనుకోవడానికి వీల్లేదిప్పుడు. ఉద్యోగుల చుట్టూ రాజకీయాలు నడుస్తున్న రోజులివి. ఎవరిదీ పాపం.? అన్నది వేరే చర్చ. ఉద్యోగులు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ ఇచ్చే హామీలతోనే ఈ తంటా వస్తోంది.
ఉద్యోగులూ సమాజంలో భాగమే. వారి ఓట్లు కూడా రాజకీయ పార్టీలకు ముఖ్యమే. అందుకే, సాధారణ ఓటర్లను ప్రలోభపెట్టినట్లే, ఉద్యోగుల్నీ రాజకీయ పార్టీలు ప్రలోభపెడుతుంటాయి. పీఆర్సీ విషయంలోనూ, మరో విషయంలోనూ ఎన్నికల వేళ ప్రభుత్వాలు ఇచ్చే హామీలు, ఆ తర్వాత నీటి మీద రాతలుగా మారిపోతే.. ఉద్యోగులు సహజంగానే ఆందోళన బాటపడతారు.
ప్రస్తుతం అదే జరుగుతోంది. ప్రభుత్వం తమ సమస్యల పట్ల సరిగ్గా స్పందించడంలేదన్నది ఉద్యోగుల ఆరోపణ. ఉద్యోగులకు చేయాల్సినదానికంటే ఎక్కువే చేస్తున్నామన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం వాదనగా కనిపిస్తోంది. ఎవరిది తప్పు.? ఎవరిది ఒప్పు.? అన్న విషయమై భిన్నవాదనలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరితే ఎలా.? అన్నది ఓ వాదన. కరోనా కష్ట కాలంలో, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పని చేశారు గనుక, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలంటున్నాయి.
ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనల్ని ఇప్పటికే తెరపైకి తెచ్చింది. ఉద్యోగ సంఘాలేమో ససేమిరా అంటున్నాయి. మరి, ఈ వ్యవహారం ఏమవుతుందో.. ప్రభుత్వమెలా ఉద్యోగుల్ని మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.