తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. వరుసగా ఎన్నికలు రానున్నందున తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. గ్రేటర్ ఎన్నికలతో పాటుగా ఎమ్మెల్సీ, దుబ్బాక ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా అప్పుడే తమ ప్రచారాన్ని ప్రారంభించాయి.
ఇక.. తాజాగా దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 7న దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉపఎన్నిక ఫలితాలు నవంబర్ 10న రానున్నాయి.
ఇప్పటికే.. అధికార పార్టీతో సహా.. బీజేపీ, కాంగ్రెస్ తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈసారి ఎలాగైనా దుబ్బాకలో అడుగుపెట్టాలని కాంగ్రెస్, బీజేపీ ఎత్తులు వేస్తుంది. ఇక.. అధికార పార్టీ ఈసారి ఎలాగైన లక్ష మెజారిటీతో గెలిచి తెలంగాణ ప్రజలు ఆ గెలుపును కానుకగా ఇవ్వాలని యోచిస్తోంది.
దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే.. ఆయన మరణించడంతో.. ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన గత ఎన్నికల్లో 60 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. 2014లోనూ దుబ్బాకలో టీఆర్ఎస్ నుంచి ఆయనే గెలుపొందారు.