కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వొచ్చు క్లారిటీ ఇచ్చిన ఈసీ

బీహార్ ఎన్నికల కారణంగా కరోనా వ్యాక్సిన్ అంశం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాము బీహార్ లో అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్  ఇస్తామంటూ బీజేపీ చేసిన ప్రకటనపై వెల్లువైన నిరసన ఆసక్తికరమైన పరిణామాల మధ్య ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేస్తామంటూ బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వస్తేనే ఇస్తారా, లేకపోతే ఉచితంగా  ఇవ్వరా అని చాలా మంది హేళన చేసిన విషయం తెలిసిందే. బీజేపీ బీహార్ కు మాత్రమే ఉచితంగా ఇస్తారా… మిగతా రాష్ట్రాలకు ఇవ్వరా అని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

అయితే ఈ వివాదం అంతటితో ఆగలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు వెళ్లింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ రకమైన ఎన్నికల హామీని  ఇచ్చిందని పలువురు ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రకటించిన హామీ సరైందో కాదో తెలపాలని ఈసీని కోరారు.

దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం… ఎన్నికల కోడ్ ను బీజేపీ ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామన్న హామీ కోడ్ ఉల్లంఘనలోకి రాదని తేల్చిచెప్పింది. ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రకటించే స్వేచ్ఛ ఆయా పార్టీలకు ఉందని స్పష్టం చేసింది. కావాలంటే మిగతా పార్టీలు కూడా ఈ హామీ ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. మొత్తం కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాని… అంతలోపు రాజకీయ పార్టీలకు దీన్ని ప్రచారాస్త్రంగా వాడేసుకుంటున్నాయి.