ఎడ్యుకేషన్ మాఫియా: కరోనా వేళ ఫీజులుం తగ్గేదెలా.?

Education Mafia

Education Mafia

ప్రైవేటు విద్యా సంస్థలు కరోనా సంక్షోభంలో పండగ చేసుకుంటున్నాయి. అదేంటీ, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో స్కూళ్ళు లేవు కదా.? మరెలా పండగ చేసుకుంటున్నాయంటే.. ఆన్‌లైన్ వుంది కదా.. ఆ విధంగా దోచుకుంటున్నాయన్నమాట.

దోపిడీ విషయంలో ప్రైవేటు విద్యాసంస్థలన్నీ ఓ మాఫియాగా ఏర్పడ్డాయన్న ఆరోపణలున్నాయి. మరి, ప్రైవేటు స్కూళ్ళలో, కాలేజీల్లో టీచర్లు, లెక్చరర్లెందుకు రోడ్డున పడుతున్నారంటే, కరోనా లాక్ డౌన్ సమయంలో తక్కువమంది సిబ్బందితో స్కూళ్ళను, కాలేజీలను ఆన్‌లైన్ విధానంలో నడిపేందుకు ప్రైవేటు విద్యా సంస్థలకు వెసులుబాటు దొరికింది మరి.

నిర్దాక్షిణ్యంగా టీచర్లను, లెక్చరర్లను రోడ్డున పడేస్తున్నాయి విద్యా సంస్థలు. విద్యార్థుల తల్లిదండ్రుల్ని దోచేస్తూ, విద్యార్థుల్ని మానసికంగా హింసిస్తూ.. విద్యా సంస్థల యాజమాన్యాలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయి.

ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ విద్యకు ఫీజులతో ముడిపెట్టకుండా విద్యార్థులందరికీ ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని ఆదేశించింది న్యాయస్థానం.

లాభాపేక్ష లేకుండా పనిచేసే సొసైటీలు కూడా కార్పొరేట్ సంస్థల్లా వ్యవహరిస్తే ఎలాగని నిలదీసింది. ఫీజులు చెల్లించలేదని ఆన్‌లైన్ తరగతులు ఎలా ఆపుతారని ప్రశ్నిస్తూ, ఆ చర్య పిల్లల చదువుకునే హక్కుని కాలరాయడమేనని తేల్చి చెప్పింది.

ఇది ఒక్క హైద్రాబాద్ స్కూల్ చేస్తున్న దాష్టీకం మాత్రమే కాదు.. చాలా విద్యా సంస్థలది ఇదే తీరు. ఫీజులు పెంచొద్దనీ, కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా, ప్రైవేటు విద్యా సంస్థల మాఫియా లెక్క చేయడంలేదు.

కోర్టు తీర్పుతో అయినా, ప్రైవేటు మాఫియా వెనక్కి తగ్గుతుందా.? లేదంటే, పిల్లల చదువుకునే హక్కుని నాశనం చేయడం వైపేటు మాఫియా మొగ్గు చూపుతుందా.? వేచి చూడాల్సిందే.