ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రాల ముందు గంటల తరబడి బారులు తీరాల్సిందే. ఒంట్లో శక్తి ఉన్నా లేకున్నా, ఆరోగ్యం సహకరించినా లేకున్నా… ప్రజాస్వామ్యయుతంగా వచ్చిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిందే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతగా పెరుగుతున్నా ఈ కష్టం మాత్రం తప్పడం లేదు. ఎన్నికల విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది కాని… వృద్ధులకు, రోగులకు, వికలాంగులకు ఈ సదుపాయం లేదు.
అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ రానున్న గ్రేటర్ ఎన్నికలతో మారనుంది. దేశంలో తొలిసారిగా ఈ-ఓటింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎందుకంటే ఇది కరోనా కాలం కదా. అనవసరంగా జనాలు ఓ చోట పొగై లేని పోని రోగాన్ని అంటించుకునే బదులు ఇలా ఓట్ల పండగను ఈసారి కానిచ్చేస్తే బాగుంటుంది అన్న ఐడియాతో ఈ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ఈ-ఓటింగ్ విధానంపై ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు ఈపాటికే పలు దఫాలుగా చర్చించారు. సాధ్యమైనంత త్వరలో డెమో ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోరింది.
ఈ ఓటింగ్ విధానం అమలులోకి వస్తే ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈపాటికే ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం త్వరలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ కానుంది. ఆలోచన మంచిదే కాని ఆచరణలో నిష్పక్షపాతంగా అమలు అయితే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా ఓటర్ల జాబితానే సక్రమంగా తయారు చేసుకోలేని దుస్థితిలో మన ప్రజాస్వామ్యం ఉంది. పైగా ఈవీఎం మెషీన్లు ట్యాంపర్ ప్రూఫ్ కాదు, బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్న నేపథ్యంలో మరి ఈ కొత్త విధానం ఏ మేరకు సఫళీకృతం అవుతుందో చూడాలి. అయితే ఇంకో మాట ఈ-ఓటింగ్ విధానం కేవలం వృద్ధులు, ఆరోగ్యం బాగా లేని వాళ్ల కోసమే మాత్రమే సుమండి.