దుబ్బాక ఉప ఎన్నికల్లో హోరా హోరీ ప్రచారం ముగిసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, పోలీస్ అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం ముగిసే సమయానికి తెరాసకు గట్టి పోటీదారులుగా నిలిచాయి. ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ ఓటర్లలో సైతం నెలకొంది. ఈ ఉత్కంఠ పరిస్థితుల నడుమే ఈరోజు పోలింగ్ ముగిసింది. దాదాపు అన్ని కేంద్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అయితే ఇప్పుడే అసలు టెంక్షన్ మొదలైంది. అభ్యర్థుల మాటల యుద్దాలు ముగియడంతో అంతా అయిపోయింది ఇక ఫలితాలే అనుకుంటుండగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తమ హడావుడిని మొదలుపెట్టాయి.
ఒక సర్వే ఏమో బీజేపీ అంటే ఇంకొక సర్వే తెరాస గెలుస్తుందని మరొక సర్వే గెలుపు కాంగ్రెస్ పార్టీదే అంటూ ఎప్పటిలాగే ఓటర్లను తికమక పెట్టేస్తున్నాయి. పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం, 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు రెండోస్థానం, కాంగ్రెస్‌కు 13 శాతం ఓట్లతో మూడవ స్థానం దక్కనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఇక థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని తేలింది. 51 నుండి 54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత తొలిస్థానంలో ఉంటారని 33 నుండి 36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండవ స్థానం, 8 నుండి 11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానం లభిస్తుందని తెలిపింది.
ఇలా ఒక్కో సర్వే ఒక్కో అంచనా వేస్తుండటంతో జనంలో ఆసక్తి పెరిగిపోతోంది. పైగా ఈ ఎన్నికలను రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లకు ట్రయల్ వర్షన్ అని, ప్రతిపక్షాన్ని డిసైడ్ చేసే ఎన్నికలుగా భావిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ వర్గాలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తమ ఆధిక్యాన్ని మరోసారి నిరూపించుకోవాలి కేసీఆర్ భావిస్తుంటే విజయాన్ని సొంతం చేసుకుని భవిష్యత్తు మాదేనని చాటుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ఆశపడుతున్నాయి. కొందరు పరిశీలకులైతే ఊహించని అభ్యర్థి గెలుపును సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఫలితాలు వెలువడే 10వ తేదీ వరకు ఆగాల్సిందే.