ఒక పక్క హైదరాబాద్ లో భారీ స్థాయిలో వరదలు వచ్చి, అల్లకల్లోలం జరుగుతుంటే, మరోపక్క దుబ్బాకలో మాత్రం రాజకీయ వేడి ఇంకా హిట్టేక్కిపోతుంది. నవంబర్ 3 న జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించటం కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే గణాంకాలు ప్రకారం చూస్తే మొత్తం దుబ్బాకలో లక్ష 90 వేలు ఓట్లు వున్నాయి. ఇందులో 90 వేలు ఓట్లు బీసీలు, మిగిలిన ఓట్లు ఓసీ ,ఎస్టీ , ఎస్సీ వర్గాలకు చెందినవి.
ఇక్కడ ముఖ్యంగా చేనేతలు 20 వేలు ఓట్లు వరకు కలిగి వుంటారు, అదే విధంగా మహిళా బీడీ కార్మికులు మరో 20 వేలు ఓట్లు కలిగి వుంటారు. దుబ్బాకలో విజయం సాధించాలంటే కచ్చితంగా ఈ రెండు రంగాలకు చెందిన కార్మికులు ఎటు వైపు ఉంటే అటు వైపు విజయం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకోసం అన్ని పార్టీలు ఈ ఇద్దరును ప్రసన్నం చేసుకోవటం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. దుబ్బాకలో దాదాపు 57 వేలు మంది దాక ప్రభుత్వ ప్రతిఫలాలను వివిధ రూపాల్లో పొందుతున్నారు. దాదాపు ప్రతి ఇంటికి కనీసం ఒకరు చొప్పున పొందుతున్నారు. కాబట్టి ఆ ఓట్లు అన్ని తమకే గంపగుత్తుగా పడుతాయని తెరాస భావిస్తుంది. ప్రతి ఏడాది 40 వేలకోట్లు అభివృద్ధి కోసం ఖర్చుపెడుతున్నామని, కాబట్టి బడుగు బలహీన వర్గాల ఓట్లు తమకే అంటూ హరీష్ రావు చెపుతున్నాడు. కానీ ఈ మాటలు విని ఓట్లు వేసే రోజులు ఎప్పుడో పోయాయి. ఆ ఒక్క నమ్మకంతోనే గెలుపు సాధ్యం అనుకోవటం భ్రమే.
మరోపక్క బీజేపీ కూడా దూకుడు చూపిస్తూ దేశ ప్రధాని బీసీ వర్గానికి చెందిన నేత. బీసీ ల అభివృద్ధి కోసం బీజేపీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని, బీసీ రాజ్యం రావాలంటే బీజేపీ కి ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఇంకో పక్క కాంగ్రెస్ కి చెప్పుకోవటానికి పెద్దగా ఏమి లేకపోవటంతో ప్రభుత్వ వైఫల్యాలను చెపుతూ, తెలంగాణ ఇచ్చింది మేమేనంటూ తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఎవరి ప్రచారం ఎలా సాగిన కానీ అంతిమ పోరులో విజయం సాధించాలంటే కచ్చితంగా బీసీ ఓట్లు, అదే విధంగా చేనేత, మహిళా బీడీ కార్మికుల అండ చాలా అవసరం. అయితే ఆ రెండు వర్గాలు ఇప్పుడు ఎవరి వైవు మొగ్గు చూపుతున్నాయో ఏ ఒక్క రాజకీయ పార్టీకి అంతుచిక్కటం లేదు. గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే మాత్రం తెరాస కి విజయం దక్కే అవకాశాలు లేకపోలేదు. దానికి తోడు సానుభూతి ఓట్లు కూడా కలిసి వచ్చే ఛాన్స్ వుంది, కాకపోతే సోలిపేట రామలింగా రెడ్డి దుబ్బాకలో సరైన అభివృద్ధి చేయలేదనే వాదనలు కూడా స్థానిక ప్రజల నుండి వినిపిస్తుంది. దానిని ప్రతిపక్షాలు తమకు ఎంత వరకు అనుకూలంగా మలుచుకుంటారు అనేదానిని బట్టే వాళ్ళ విజయం ఆధారపడి వుంది