ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయిన విషయం విదితమే. సూపర్ స్టార్ తనయుడిగా.. తనదైన స్టార్‌డమ్ అందుకోవాల్సిన ఆర్యన్ ఖాన్, ఎందుకిలా డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు.? ఈ కేసుకి సంబంధించిన వాస్తవాలేంటి.?
ఆర్యన్ ఖాన్ అరెస్టు మాట నిజం. కానీ, అతను డ్రగ్స్ తీసుకున్నాడా.? లేదా.? డ్రగ్స్ పెడ్లింగ్ ఆరోపణల్లో నిజమెంత.? ఇవన్నీ ఇప్పుడప్పుడే తేలే వ్యవహారాలు కాదు. ‘ఓ వ్యక్తి అరెస్టయినంతమాత్రాన దోషి కాదు.. విచారణ జరగాలి.. నిజానిజాలు తేలాలి..’ అంటున్నాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారంపై స్పందిస్తూ.
అసలు సినిమాకీ, డ్రగ్స్‌కీ లింకేంటి.? అంటే, సినిమా అంటేనే అదొక గ్లామర్ ప్రపంచం. సినీ జనాలకు నైట్ పార్టీలు కొత్తేమీ కాదు. వీటిల్లోనే డ్రగ్స్ ఎక్కువగా చెలామణీ అవుతున్నాయ్.. మొహమాటానికో, బలవంతానికో.. డ్రగ్స్ అనేవి అలవాటు చేసేసుకోవాల్సి వస్తోంది. అందరూ అని అనలేంగానీ, ఈ తరం నటీనటుల్లో చాలామంది వాటికి తెలిసో తెలియకో బానిసలైపోతున్నారు.
ఓ క్రూయిజ్ షిప్.. అందులో రేవ్ పార్టీ.. అందులో వెళ్ళిన ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ముందే వచ్చిన సమాచారం.. అత్యంత వ్యూహాత్మకంగా పోలీస్ అధికారులు, ఈ రాకెట్‌ని భగ్నం చేశారు. ఇదీ ఆర్యన్ ఖాన్ వ్యవహారంలో జరిగింది.
ఇంతకు ముందూ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీలు అరెస్టయ్యారు.. వారిలో దోషులుగా తేలినవారెంతమంది.? దొరికేది వందల్లో.. దోషులుగా తేలేది సింగిల్ డిజిట్ కూడా కాదు. అదే అసలు సమస్య. ఈ అరెస్టుతో ఆర్యన్ ఖాన్ పాపులారిటీ పెరుగుతుంది. అంతే తప్ప, సినిమాకీ డ్రగ్స్‌కీ వున్న లింకు ఇప్పట్లో తెగిపోతుందని అనుకోలేం. సినిమా – డ్రగ్స్ మధ్య సంబంధాలకు కారణాలు తెలిసినా, ఆ సంబంధాలు తెగ్గొట్టడం దాదాపు అసాధ్యం.