విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మత్తు విభాగం వైద్యుడు డాక్టర్ సుధాకర్, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులకు మాస్కులు అందుబాటులో లేవని ఆరోపిస్తూ, ఓ వీడియో విడుదల చేయడం అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత మరింత వివాదాస్పద రీతిలో డాక్టర్ సుధాకర్, నడిరోడ్డు మీద అర్థనగ్నంగా కనిపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదా, ప్రధాని నరేంద్ర మోడీ మీదా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ క్రమంలో డాక్టర్ సుధాకర్ మీద దాడి జరిగిందనీ, ఆ దాడికి పోలీసులే కారణమనే ఆరోపణలూ వచ్చాయి. ఆయన్ని మానసిక వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనను చంపేందుకు కుట్ర జరిగిందని డాక్టర్ సుధాకర్ ఆరోపించారు.
ఇంత రగడ నడుమ, ఈ కేసు విచారణ సీబీఐ చేతికి అప్పగించింది రాష్ట్ర హైకోర్టు. కానీ, ఇంతవరకు సీబీఐ ఈ కేసులో ఎలాంటి విచారణ చేసింది.? ఏం తేల్చింది.? అన్నది మాత్రం వెల్లడి కాలేదు. ఈలోగా డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మాజీ మంత్రి నారా లోకేష్, డాక్టర్ సుధాకర్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ డాక్టర్ సుధాకర్ తల్లిని పరామర్శించారు. డాక్టర్ సుధాకర్ మానసిక ఆందోళనకు గురై ప్రాణాలు కోల్పోయారనీ, దీన్ని తాము ప్రభుత్వ హత్యగా పరిగణిస్తున్నామనీ అన్నారు. డాక్టర్ సుధాకర్ తల్లి చేసే న్యాయ పోరాటానికి టీడీపీ అండ వుంటుందనీ నారా లోకేష్ చెబుతున్నారు. మనిషి బతికున్నప్పుడే కేసు విచారణ ఓ కొలిక్కి రాలేదు. ఆ మనిషే పోయాక.. సీబీఐ విచారణ కాదు కదా, ఇంకే విచారణ జరిగినా ప్రయోజనమేముంటుంది.?