హౌసింగ్ లొల్లితో తెలంగాణలో రసవత్తర రాజకీయాలు తెరపైకి వచ్చాయి. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య తెరపైకి వచ్చిన బస్తీమే సవాల్ నేపధ్యంలో రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో మంత్రి తలసాని యాదవ్ సవాల్ స్వీకరించిన కాంగ్రెస్ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలు పర్యటించి డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.
లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ళను చూపించి కాంగ్రెస్ నోరు మూయించాలని టీఆర్ఎస్ భావిస్తుండగా, మరోవైపు పక్కాగా లెక్కలు తేల్చి అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో ఈరోజు గ్రేటర్ పరిధిలోని కొల్లూరు, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, మేడ్చెల్, జవహార్ నగర్, రాజేంద్రనగర్‌లలో డబుల్ బెడ్‌రూం ఇళ్ళను పరిశీలించాల్సి ఉంది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య డబుల్ గేమ్ బస్తీల్లో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది.
అయితే గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్ళు నిర్మిస్తున్నామని చెప్పిన అధికార టీఆర్ఎస్ పార్టీని భట్టి విక్రమార్క ఊహించని విధంగా ఇరుకున పెట్టారు. ఈ క్రమంలో తలసాని యాదవ్ తొలిరోజు మూడువేల ఇళ్ళను మాత్రమే చూపించారని, మొత్తం లక్ష ఇళ్ళు చూపించే వరకు మంత్రి తలసానిని వదిలిపెట్టేది లేదని భట్టి అన్నారు. అంతే కాకుండా ఊళ్ళళ్ళో నిర్మించిన ఇళ్ళను చూపిస్తే ఊరుకునేది లేదని, లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ళు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే చూపించాలని భట్టి డిమాండ్ చేశారు. అప్పటి వరకు టీఆర్ఎస్ సర్కార్‌ను వదిలే చాన్స్ లేదన్నారు.
ఇక మరోవైపు తలసాని కూడా హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే లక్ష ఇళ్ళను చూపిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టింది లేదని, టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఒప్పుకోవాలని, విమర్శలు చేసినంత మాత్రానా చేసిన అభివృద్ధి ఎక్కడికిపోదని తలసాని అన్నారు. ఇక తొలిరోజు పలు ప్రాంతాలను పర్యటించి డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించిన మంత్రి తలసాని, సీఎల్పీ నేత భట్టి విక్రమాక్ర, రెండో రోజు మరిన్ని ఏరియాల్లో డబుల్ ఇళ్ళను పరిశీలించే అవకాశం ఉంది. మరి సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ రాజకీయాలు తీవ్ర స్థాయికి చేరుకున్న నేపధ్యంలో, మంత్రి తలసాని యాదవ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ళను చూపిస్తారా లేక ప్రతిపక్ష నేతల విమర్శలను అధికార టీఆర్ఎస్ పార్టీ అంగీకరిస్తుందా ఇప్పుడు ఆశక్తికరంగా మారింది.