జనసేన పార్టీకి డొనేషన్లు అదిరాయ్.! పార్టీ వ్యూహం ఫలించినట్లే.?

Janasena

రాజకీయ పార్టీలు డొనేషన్లు.. అవేనండీ విరాళాలతో నడుస్తాయన్నది ఓపెన్ సీక్రెట్. కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చే బడా కార్పొరేట్ సంస్థల దగ్గర్నుంచి, వేల రూపాయలు విరాళంగా ఇచ్చే ఓ మోస్తరు స్థాయి కార్యకర్తల వరకు.. విరాళాలనేది ఓ ప్రసహనం. దీనికి తోడు, తెరవెనుక వ్యవహారాలు కూడా వుంటాయ్.

జనసేన పార్టీ.. ఫక్తు రాజకీయ పార్టీలకు భిన్నం. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ పార్టీకి ప్రధాన ఆదాయ వనరు. పార్టీ కోసం గతంలో కొందరు నేతలు ఘనంగానే ఖర్చపెట్టారనే ప్రచారం వున్నా, తమ సొంత ఇమేజ్ కోసం సొంతంగా ఖర్చు చేసుకోవడం తప్ప, పార్టీ కోసం ఖర్చు చేసిన నాయకులు చాలా చాలా తక్కువమందే కనిపిస్తారు జనసేనలో.

పవన్ కళ్యాణ్ తర్వాత, అంత కమిటెడ్‌గా పార్టీ కోసం పనిచేసేది జనసైనికులే. నిజానికి, పవన్ కళ్యాణ్ కంటే డెడికేషన్‌తో జనసైనికులు.. అనగా పవన్ కళ్యాణ్ అభిమానులు పనిచేస్తున్నారు. పవన్ సినిమాల్లో సంపాదించే కోట్ల రూపాయల్ని, పార్టీ కోసం వెచ్చిస్తోంటే.. జనసైనికులు వందల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు తమకు తోచిన రీతిలో పార్టీకి విరళంగా ఇస్తుంటారు.

ఇటీవలి కాలంలో ఈ విరాళాల వ్యవహారం ఒకింత భిన్నంగా కనిపిస్తోంది. పది రూపాయలు సైతం డొనేట్ చేసేందుకు వీలు కలగడంతో, ఈసారి అలా డొనేషన్ల రూపంలో వస్తున్న సొమ్ములు చాలా ఎక్కువగానే వున్నాయన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. కేక్ కటింగులు, బ్యానర్ల ఏర్పాటు.. వీటికి వెచ్చించే సొమ్ముని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు చాలా చోట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు.

రాజకీయాల్లో ఇది కాస్త ఆహ్వానించదగ్గ విషయమే. అయితే, పవన్ కళ్యాణ్ అభిమానుల.. జనసైనికుల నమ్మకాన్ని జనసేన అధినేత వమ్ము చేయకుండా వుండగలగాలి మరి.!