మన మీడియా సంస్థల విశ్వసనీయత గురించి మనకు తెలిసిందే. అమెరికాలో కూడా మీడియా ప్రమాణాలు అంత గొప్పగా ఏమీ లేదు. కొన్ని మీడియా సంస్థలు డెమొక్రాట్లకు మద్ధతు ఇస్తే మరికొన్ని రిపబ్లికన్ల వంతు పాడుతాయి. అయితే మరీ మనంత నిస్సిగ్గుగా వార్తలను ప్రసారం చేయవు. ఇందుకు తాజాగా చోటుచేసుకుంటున్న ఘటనే నిదర్శనం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వెనకబడ్డ ట్రంప్ మళ్లీ తన నోటికి పని చెప్పాడు. ఇష్టం వచ్చినట్లు అబద్దాలు చెప్పడం మొదలు పెట్టాడు. దీంతో ఇలాంటి అబద్దాలు ప్రసారం చేయలేమంటూ టీవీ ఛానళ్లు ఆయన లైవ్ కవరేజీని నిలిపివేశాయి.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వైట్ హౌస్ లో ట్రంప్ నిర్వహించిన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ అది. తీవ్ర నిరాశలో ఉన్న ట్రంప్ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఓట్ల లెక్కింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, కొన్ని చోట్ల లెక్కింపు పూర్తి అయినా ఫలితాలు వెల్లడించడం లేదని మొదలు పెట్టాడు. పెన్సిల్వేనియాలో తనకు 7 లక్షల ఓట్లు పడితే 90 వేలు మాత్రమే చూపిస్తున్నారని ఆరోపించాడు. కోర్టుకు వెళ్తే న్యాయమూర్తులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. న్యాయమూర్తులే అమెరికాను ఏలేందుకు పన్నాగం పన్నుతున్నారంటా…. కాకమ్మ కథలు చెప్పుకుంటూ పోయాడు. దీంతో చిరాకెత్తిపోయిన మీడియా సంస్థలు…. ట్రంప్ మాటలు నమ్మదగినవిగా లేవు… ఇలాంటి పచ్చి అబద్ధాలను మేము ప్రసారం చేయలేమంటూ … ఎంఎస్ఎన్‌బీసీ యాంకర్ బ్రియాన్ విలియమ్స్ పేర్కొంటూ ట్రంప్ లైవ్ కవరేజీని నిలిపేశారు. ఎన్‌బీసీ, ఏబీసీ న్యూస్ ఛానళ్లు కూడా ట్రంప్ లైవ్ కవరేజీని నిలిపేశాయి. అమెరికాకు ఇదొక బాధాకరమైన రోజంటూ సీఎన్ఎన్ యాంకర్ జేక్ ట్యాపర్ ట్రంప్ లైవ్ కవరేజీని నిలిపేశారు.
మరోవైపు గత రెండు రోజులుగా ట్రంప్ అబద్దాలను నమ్మి చాలా మంది ట్రంప్ మద్ధతుదారులు తూపాకులతో కౌంటింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రసారం చేస్తే పరిస్థితులు మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉండడంతో మీడియా సంస్థలు ఏకంగా అధ్యక్షుడి ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిలిపేశాయి.