తెలంగాణలో దుబ్బాక ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికలో విజయం కోసం అన్ని పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అయితే విజయమో..వీర స్వర్గమో అన్నట్లు ఎన్నికల సన్నాహాల్లో మునిగిపోయింది. కాంగ్రెస్ నుండి మొన్నటిదాకా నర్సారెడ్డి పోటీచేయబోతున్నాడు అనే మాటలు వినవచ్చాయి, కానీ తాజాగా ఢిల్లీ నుండి వచ్చిన కవర్ లో చెరకు శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారు చేసి వుంది.
బీజేపీ తరుపు నుండి రఘునందన్ రావు ను ఫైనల్ చేసారు. ఇక అధికార తెరాస నుండి సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతను ఎంపికచేసి సీఎం కేసీఆర్ స్వయంగా బి ఫామ్ అందించటం జరిగింది. ఇక ఖరారైన అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీ అయిపోయారు. తెరాసను ఓడించి ఎలాగైనా ఈ స్థానంలో విజయం సాధించాలని కాంగ్రెస్, బీజేపీ కసిగా వున్నాయి, కానీ ఆ రెండు పార్టీలకు అంత సీనుందా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే 2018 ఎన్నికల్లో తెరాస తరుపున రామలింగా రెడ్డి 89 వేలు పైచిలుకు ఓట్లు సాధించాడు. ఆయన తర్వాత స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి 26 వేలు పైగా మాత్రమే ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ పార్టీకి 22 వేలు పైచిలుకు ఓట్లు లభించాయి.
రామలింగారెడ్డి దాదాపు 60 వేలకు పైగా మెజారిటీ సాధించాడు. త్రిముఖ పోటీలో ఆ స్థాయి మెజారిటీ అంటే మాములు విషయం కాదు. ఈ మూడు పార్టీలు కాకుండా మిగిలిన చిన్నాచితకా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిసి ఒక 20 వేల ఓట్లు సాధించి వుంటారు. ఆ లెక్కన చూస్తే అక్కడ పోటీచేసిన వాళ్ళందరూ కలిసి కూడా రామలింగారెడ్డి సాధించిన ఓట్లు కూడా సాధించలేకపోయారు. పైగా దుబ్బాకలో రామలింగారెడ్డి కి మంచి పేరు ఉంది . దీనికి తోడు ఆయన చనిపోయిన సెంటిమెంట్ కూడా బలంగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసుకుంటే విజయం తెరాస వైపే కనిపిస్తుంది. అలాంటి తెరాస ను ఓడించటం అవతలి పార్టీలకు అంత సులువైన పనికాదు…