పాలమూరులో కాంగ్రెస్ ను ఖాళీ చేయిస్తున్న డి.కె.అరుణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజనకు ముందు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం చాలా మంది పోటీ పడే వారు. ఇక బీజేపీ పార్టీ తెలంగాణలోని మిగతా జిల్లాలతో పోల్చితే ఇక్కడ చాలా బలంగా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీన్ మారిపోయింది. బీజేపీ తన క్యాడర్ ను కాపాడుకోగలిగినా… కాంగ్రెస్ మాత్రం ఖాళీ అయిపోయింది. కాంగ్రెస్ నేతల్లో చాలా మంది టీఆర్ఎస్ గూటికి చేరారు. మరికొందరు కమళం పార్టీలో చేరారు.

మంత్రిగా పని చేసి, జిల్లా రాజకీయాలనే శాసించిన డీకే అరుణ కూడా పార్లమెంటు ఎన్నికల ముందు బీజేపీలో చేరి లోకసభకు పోటీ చేశారు. బీజేపీ ఓటు బ్యాంకుతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ తో కాంగ్రెస్ పార్టీ  ఓట్లను కూడా కొల్లగొట్టారు.  దీంతో జిల్లా ప్రజల్లో ఇంకా తనకు మంచి ఆదరణ ఉందని గ్రహించిన డి.కె.అరుణ సరికొత్త స్ట్రాటజీకి తెరలేపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవడంతో క్షేత్ర స్థాయిలో ప్రజల్లో మంచి పట్టున్న కాంగ్రెస్ నేతలందరినీ బీజేపీలో చేర్పిస్తున్నారు డి.కె.అరుణ. బీజేపీకి సరైన నియోజకవర్గ ఇన్‌చార్జులు లేని చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇన్‌చార్జులను ఒప్పించి మరీ బీజేపీలో భర్తీ చేయిస్తున్నారు. నారాయణపేట, అలంపూర్, మక్తల్, కొల్లాపూర్, షాద్‌నగర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేట, నాగర్ కర్నూల్ ఇలా అన్ని నియోజకవర్గాలపై స్పెషల్‌ ఫోకస్ పెట్టి మరీ తన వాళ్లందర్నీ కమలం పార్టీలో చేర్పిస్తున్నారు. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా తన ప్రభావం ఉండేలా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

డీకే అరుణతోపాటు సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జడ్చర్ల మాజీ ఎంఎల్ఏ ఎర్ర శేఖర్ తో పాటు తదితరులు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీకి జిల్లాలో మరికొంత బలపడింది. పలు సమీకరణల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరలేక కాంగ్రెస్ లో ఇమడలేక ఇబ్బందిపడుతున్న నేతలందర్ని కషాయపార్టీలో చేర్పించేందుకు డి.కె.అరుణ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈపాటికే చాలా మందిని చేర్పించారు కూడా. దీంతో రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీకి ఆమె పెద్ద దిక్కు కాబోతున్నారని స్థానికుల టాక్.