Districts Hiccups : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్యని 26కి పెంచింది వైఎస్ జగన్ సర్కారు. ఆయా జిల్లాల్లో ఈ సెగలు బాగానే కనిపిస్తున్నాయి. కొన్ని సానుకూల స్పందనలూ లేకపోలేదు. ‘మా ముఖ్యమంత్రి బహు బాగా చేశారు..’ అంటూ వైసీపీ నేతలు పలు చోట్ల ర్యాలీలు తీస్తున్నారు. ఎన్టీయార్ కుటుంబం, కృష్ణా జిల్లాలో ఓ భాగానికి ఎన్టీయార్ పేరు పెట్టడాన్ని స్వాగతించింది.
అంతా బాగానే వుందిగానీ, కడప జిల్లా రాజంపేటలో మాత్రం అలజడి బయల్దేరింది. అది కూడా స్థానిక వైసీపీ నేతలే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్నమయ్య పేరుతో జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు సరే, జిల్లా కేంద్రంగా రాజంపేటను కాకుండా, రాయచోటిని ఎలా నిర్ణయిస్తారు.? అన్నది స్థానిక వైసీపీ నేతల వాదన.
విద్యార్థులు, వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున రాజంపేటలో ఆందోళనలు నిర్వహించారు. అన్నమయ్య విగ్రహాల సాక్షిగా కదం తొక్కారు. విపక్షాలకు చెందిన నేతలు, ఆయా పార్టీల కార్యకర్తలూ ఈ ఆందోళనల్లో పాల్గొనడం గమనార్హం. ఇదెక్కడి చోద్యం.? వైసీపీ శ్రేణులే, వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు ఎదురుతిరగడమా.? ఇదేదో గూడు పుఠానీలా వుందే.. అంటూ కడప జిల్లాలో జనం చర్చించుకుంటున్నారు.
మదనపల్లి జిల్లా కావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం పట్టణాన్ని ఎలా వేరు చేస్తారన్న ప్రశ్నలూ తెరపైకొస్తున్నాయి. ప్రకాశం జిల్లా విషయమై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జిల్లాకి అన్యాయం జరిగిందనీ, పెద్ద జిల్లా కాస్తా ఇప్పుడు అతి చిన్న జిల్లా అయిపోయిందంటూ విశాఖ వాసులు ఆవేదన చెందుతున్నారు.
ఎలా చూసినా, జిల్లాల రచ్చతో వైసీపీకి నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోందన్నది నిర్వివాదాంశం.