YSRCP MLA Threatens : చెత్త రాజకీయం: పన్ను కట్టకపోతే, ఇంటి ముందు చెత్త వేస్తారట.!

YSRCP MLA Threatens : చెత్తకు పన్ను వేయడమేంటి చెత్త రాజకీయం కాకపోతే.? అన్న ప్రశ్న ఓ వైపు జనం నుంచి గట్టిగా దూసుకొస్తోంటే, ‘సంక్షేమ పథకాల పేరుతో పంపకాలు చేయాలంటే, పన్నులు వేయడం తప్ప వేరే మార్గం లేదు..’ అంటోంది వైసీపీ. ‘చెత్త పన్ను కట్టకపోతే, చెత్తని మీ ఇంటి ముందే వేసేస్తాం..’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేయడం, రాజకీయాల్లో పెను దుమారానికి కారణమయ్యింది.

ఇళ్ళ ముందు చెత్తనీ, ఇళ్ళలో రోజువారీ ఉత్పత్తి అయ్యే చెత్తనీ గ్రామ పంచాయితీలో, నగర పాలక సంస్థలో తీసుకెళ్ళడం అనేది కొత్త విషయం కాదు. కానీ, చెత్త మీద పన్నులు వేయడం మాత్రం కొత్త విషయమే. నిజమే, ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాయ్. కానీ, ఎలా.? ఎందుకు.? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.

సంక్షేమ పథకాలు కావాలని జనం అడగలేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దుగ్ధతో రాజకీయ పార్టీలే సంక్షేమం పేరుతో హామీలు ఇస్తుంటాయి. అలా ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి మళ్ళీ ప్రజల నెత్తినే భారం మోపుతాయి. రాజకీయ నాయకుల జేబుల్లోంచి ఎన్నికల సమయంలో తప్ప, సాధారణ సమయాల్లో ఒక్క రూపాయి కూడా బయటకు రాదు. ఒకవేళ వచ్చినా, ఆ రూపాయికి పదింతలు సంపాదించుకునేందుకే రాజకీయాలు చేస్తారు రాజకీయ నాయకులు.

ఇవన్నీ అర్థం చేసుకోలేని ప్రజల అమాయకత్వమే, ప్రజలకు శాపంగా మారుతోంది. చెత్త పన్ను కట్టకపోతే, ఇంటిముందు చెత్త వేస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా బెదిరించడమంటే, రాజకీయాలు ఎటువైపు వెళుతున్నట్టు.?

ఎన్నికల వేళ ఇలాంటి ప్రకటనలు చేసి, జనాన్ని ఓట్లడిగే ధైర్యం ఏ రాజకీయ నాయకుడికీ, ఏ రాజకీయ పార్టీకి కూడా వుండదు. అయినా, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా.. అన్నట్టు, రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలు.. ఈ ‘చెత్త రాజకీయాన్ని’ భరించాల్సిందే.. తప్పదు.!