శంకర్.. ఒకప్పుడు తిరుగులేని స్టార్ డైరెక్టర్. విజయమే తప్ప ఓటమి ఎరుగని దర్శకుడు ఆయన. ఆయన సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్. మేకింగ్ అయితే ఇంటర్నేషనల్ లెవల్. ఇక వసూళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు. కథలో తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అనే నమ్మకం. స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఉవ్విళ్ళూరేవారు. నిర్మాతలైతే అడిగినంత బడ్జెట్, డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు తలకిందులయ్యాయి. కారణం ఫ్లాప్. పరాజయం ఎదురైతే ఎవరైనా సరే ఇబ్బందిపడాల్సిందే అనే మాటకు శంకర్ కూడ అతీతుడు కారని రుజువైంది.
ఆయన చేసిన ‘2.0’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. నిర్మాతలు పెద్ద మొత్తంలో లాస్ అయ్యారు. ‘ఇండియన్-2’ సెట్స్ మీదనే మూలుగుతోంది. పూర్తవుతుందో లేదో కూడ తెలియదు. అక్కడి నుండి శంకర్‌కు బ్యాడ్ టైమ్ మొదలైంది. శంకర్ కెరీర్ చూస్తే ఏనాడూ ఆయన ఒకేసారి రెండు మూడు సినిమాలను ప్రకటించింది లేదు. ఏడాదికి చేస్తే ఒక సినిమా మాత్రమే చేసేవారు. అందరిలాగా సినిమాలను సెట్ చేసుకోవడానికి పాకులాడేవారు కాదు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఒకేసారి రెండు సినిమాలను ఒప్పుకున్నారు. త్వరలో రామ్ చరణ్ చిత్రం స్టార్ట్ చేయనున్న ఆయన నిన్న రణ్వీర్ సింగ్ తో ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ అనౌన్స్ చేశారు. ఆయన ఇంతలా ముందు జాగ్రత్తపడుతూ సినిమాలకు సైన్ చేస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.