Director Samudra: ప్రకాష్ రాజ్, తాను ముందు నుంచే మంచి స్నేహితులమని, ఆయన ఆర్టిస్ట్‌గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బాలచందర్ దగ్గర ఓ సినిమా చేసి, ఆ తర్వాత తెలుగులో చేసేందుకు ఏఎం. రత్నం గారి దగ్గరికి వచ్చారని డైరెక్టర్ సముద్ర అన్నారు. తాము అప్పటికి ఏఎం. రత్నం గారి దగ్గర పని చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ అక్కడికి వచ్చినపుడు తామంతా కుర్చోల్లో కూర్చుంటే ఆయన మాత్రం సింహరాశిలో హీరో కూర్చున్నట్టు కింద కూర్చునేవాడని ఆయన తెలిపారు. అక్కడ ఎంత మంది ఉన్నా సరే ఆయన మాత్రం అలానే కూర్చునేవారని, కిందనుంచి లేవమని అడిగితే లేదురా నేను ఇక్కడ బాగా నటిస్తాను అని చెప్పి చాలా బాగా యాక్ట్ చేసేవాడని ఆయన నవ్వుతూ చెప్పారు.
అలా అప్పటినుంచి ప్రకాష్ రాజ్, తాను మంచి మిత్రులమయ్యామని ఆయన తెలిపారు. ఎఎం. రత్నం డైరెక్షన్ & ప్రొడక్షన్‌లో వచ్చిన సంకల్పం అనే సినిమాలో తాము కలిసి పని చేశామని ఆయన అన్నారు. కాగా ఆ తర్వాత ఆయన కొంత కాలంలోనే పెద్ద విలన్‌గా పేరు తెచ్చుకున్నాడని సముద్ర తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి మహేష్ బాబు గారిది ఓ సినిమా ఖరారైంది. నిన్నటి నుంచి షూటింగ్ మొదలైందని, డైరెక్షన్‌కు ట్రై చేస్తున్నావ్ కదా… మహేష్‌కు పరిచయం చేస్తాను రమ్మని అన్నారట.
అలా చెప్పగానే తాను పద్మాలయ స్టూడియోస్‌కి వెళ్లానని, అక్కడ అప్పటికే ఉన్న ప్రకాష్ రాజ్ తనను పిలిచి, మహేష్.. నా ఫ్రెండ్ వీడు సముద్ర.. వీలైతే డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వు, కథ విను అనగానే ఆయన కూడా ఓకే అన్నా వింటాను అని, రెండు రోజులు కాగానే మనం కలుద్దాం సర్ అని మహేష్ బాబు తనతో అన్నట్టు సముద్ర తెలిపారు. అలా తనకు మహేశ్ బాబు పరిచయం అవ్వడం, కథ చెప్పడం, వెంటనే ఆయనక్కూడా నచ్చడం అలా జరిగిపోయానని ఆయన చెప్పారు.