విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైకాపా తీర్ధం పుచ్చుకోవాలని కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గంటా కంచుకోటైన విశాఖనగరాన్ని జగన్ సర్కార్ ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ గా ప్రకటించడంతో గంటా మనసంతా ప్యాన్ గాలివైపే ఉంది. ఎలాగైనా ఆ పార్టీలో చేరి విశాఖలో చక్రం తిప్పాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన అనుచరగణాన్ని వైకాపాకే మద్దతివ్వమని చెప్పినట్లు ఇప్పటికే కథనాలు వేడెక్కించాయి. గంటా మద్దతుదారులు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గనబాబు వైకాపా గూటికి చేరడానికి ఇప్పటికే రంగం సిద్దం చేస్తున్నారు. రేపో మాపో తమ అనుచరణగణంతో వైకాపా కండువా వేసుకోనున్నారు.
వీరిద్దరి ఎంట్రీ విషయంలో గంటా కీలక పాత్ర పోషించారని మొదటి నుంచి వినిపిస్తున్నదే. ఇంకా రాష్ర్టంలో ఇతర జిల్లాలో నుంచి తేదాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడి ప్యాన్ కిందకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో గంటాకి లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది. గంటాలో ఉన్న కొన్ని లోపాలు కారణంగా ఇన్నాళ్లు దూరం పెట్టిన వైకాపా ఇప్పుడు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని ఈ సందర్భంగా పలువురు నేతల్లో చర్చకొచ్చింది. అయితే ఇక్కడ గంటాకు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడానికి మరో కారణంగా కూడా ప్రధానంగా వినిపిస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీపై ఎలాంటి కామెంట్లు గానీ, విమర్శలు గానీ చేయలేదు.
అలాగే తన సొంత పార్టీ ని వెనకేసుకొచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. వీటన్నింటికి మించి గంటాకి విశాఖ కంచుకోట. ఆయన బలగం, బలం అంతా విశాఖలోనే ఉంది. ఆయన సామాజిక వర్గం కూడా ఆ జిల్లాలో అధికం. ప్రస్తుతం విశాఖ ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ చేయడం…ప్రభుత్వంపై వస్తోన్న వ్యతిరేకతకు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి బలమైన నాయకుడు విశాఖలో పార్టీకి ఇప్పుడు అత్యంత అవసరం కూడా. విశాఖ గ్యాస్ దుర్ఘటన నేపథ్యంలో స్థానిక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతతి తెలిసిందే.
ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించినా ప్రజలు ఆందోళనలు వారం రోజుల పాటు మిన్నంటాయి. వీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికి ప్రధాన కారణం స్థానికంగా తమ పార్టీకి చెందిన బలమైన నాయకుడు లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో గంటా తమ పార్టీలో ఉంటే అక్కడ సన్నివేశం మరోలా ఉండేదన్న వాదన వినిపించింది. ఈ విషయాలన్ని ఆలోచించుకునే వైకాపా నేతలు ఇప్పుడు గంటా ఎంట్రీకి మార్గం సుగమం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.