బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు, కళ్ళు మూసుకొని పాలు తాగిన పిల్లి చందంగా సోము మాట్లాడటం విశేషం, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేసిందనీ.. ఆ తప్పులు సరిదిద్దకుండా మరిన్ని తప్పుల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోందనీ సోము సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు కానీ, అసలు తప్పు ఎక్కడ జరుగుతోందో సోము వీర్రాజు కు కానీ బీజేపీకి కానీ తెలియదని ఎలా అనుకోగలం.?
పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలా చంద్రబాబు వాడుకున్నారని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ఆరోపణలు చేశారు. అంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో దోపిడీ జరిగితే, ప్రధాని ఏం చేస్తున్నారు.? సీబీఐ విచారణకు ఆదేశించారా.? ఇంకేదన్నా విచారణ జరిపించారా.? పోలవరం జాతీయ ప్రాజెక్టు. అంటే, ఈ ప్రాజెక్టుని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిది. కేంద్రం, తనకు చేతకాక.. ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతని రాష్ట్రానికి అప్పగించి.. తాను మాత్రం పర్యవేక్షణకే పరిమితమయ్యింది. సో, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదన్నా తప్పు జరిగితే, ఆ తప్పుని ఉపేక్షించిన కేంద్రమే తొలి ముద్దాయి అవ్వాల్సి వుంటుంది. పైగా, చంద్రబాబు హయాంలో బీజేపీ – టీడీపీ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబు తప్పు చేశాడంటే అందులో మోడీకి కూడా భాగం వున్నట్లే కదా..?
పోలవరం విషయంలో మొదట బాబు అక్రమాలు చేశారని విమర్శించిన మోడీ సర్కార్ ఆ తర్వాత పోలవరంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ఇక, వైఎస్ జగన్ పాలన విషయానికొస్తే, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం ఏర్పడేలా చేశారు. ఆ లెక్కల వ్యవహారాల్ని కేంద్రం పరిశీలించాలి కదా.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కదా.! పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు, పాత లెక్కల ప్రకారం మాత్రమే నిధులు ఇస్తామంటే ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుందో సోము కు తెలియదా..? ఇదే విషయాన్నీ కేంద్రంతో మాట్లాడి తేల్చుకోవాలి కదా..? ఆ బాధ్యత సోము వీర్రాజు కు లేదా..? ఇవ్వని కూడా వదిలేసి, టీడీపీ మీద వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ తమకేమి పాపం తెలియదన్నట్లు సోము మాట్లాడటం దారుణం