‎Gopichand-Prabhas: గోపీచంద్ కోసం ఆ సినిమాను త్యాగం చేసిన ప్రభాస్.. తీరా కట్ చేస్తే ఫలితం అలా!

‎Gopichand-Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడని చెప్పాలి. బాహుబలితో మొదలై మొన్నటి కల్కి వరకు ప్రభాస్ చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే. ఇప్పుడు డార్లింగ్ చేతిలో ఉన్న అరడజను సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ది రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 తో పాటు ప్రశాంత్ వర్మతో కూడా ఒక క్రేజీ మూవీ చేస్తున్నాడు ప్రభాస్.

‎మరోవైపు డార్లింగ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ మాత్రం ఈ మధ్యన వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు. సిటీమార్ తర్వాత అతను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆరడగుల బుల్లెట్టు, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా సినిమాలన్నీ ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచాయి. అయితే గత ఏడాది రిలీజ్ అయిన విశ్వం మూవీ మాత్రం యావరేజ్ గా నిలిచింది. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ గోపీచంద్ కెరీర్ ను కాస్త గాడిలో పెట్టింది. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ ఫ్రెండ్స్ యువీ క్రియేష‌న్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్ ను నడుపుతున్నారు.

‎ఈ బ్యాన‌ర్ లో తెరకెక్కే సినిమాల విషయంలో ప్ర‌భాస్ ఇన్వాల్వ్‌మెంట్ డైరెక్ట్ గా లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న స‌లహాలు సూచ‌న‌లు మాత్రం త‌ప్ప‌క ఉంటాయి. అలా పదేళ్ల క్రితం ఒక సినిమా కథ ప్రభాస్ దగ్గరకు వచ్చిందట. కొత్త దర్శకుడు అయినా కథ బాగా నచ్చిందట. అయితే అప్పటికే తాను బాహుబలి సినిమాతో బిజీగా ఉండటంతో డైరెక్టర్ ను వెయిట్ చేయించడం ఇష్టం లేని ప్రభాస్ ఇదే సినిమా కథను తన స్నేహితుడు గోపీచంద్ కు చేయమని చెప్పాడట. ప్రభాస్ సూచనల మేరకు గోపీచంద్ కూడా కథ విన్నాడట. అతనికి కూడా స్టోరీ తెగ నచ్చేసిందట. దీంతో వెంటనే ఓకే చెప్పాడట. ఆ తర్వాత సినిమా పట్టాలెక్కడం, సూపర్ హిట్ అవ్వడం చకా చకా జరిగిపోయాయి. పైగా ఈ సినిమాలో గోపీచంద్ అప్పియరెన్స్ అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు మ్యాచో స్టార్. ఇంతకీ ఆ సినిమా ఏంటో చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. ఆ మూవీ పేరు జిల్. 2014లో విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది.