టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం జైలు నుండి విడుదలయ్యారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ పరీశీలకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద జి.కొండూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి అరెస్టు చేయటం జరిగింది. ఆ తరువాత జి.కొండూరు పోలీస్ స్టేషన్ నుండి ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. తనపై అక్రమంగా కేసులు బనాయించారంటూ దేవినేని ఉమా హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో బెయిల్ పిటీషన్ పై ఇరు పక్షాల వాదన విన్న ఏపీ హై కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ కు సంబంధించిన డాకుమెంట్స్ ను ఈ రోజు జైలులో సమర్పించడంతో కొద్దిసేపటి క్రితం ఆయనను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా… ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా న్యాయదేవత అనుగ్రహంతో విడుదలయ్యానని అన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరని హెచ్చరించారు.