3 Capitals : ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మంత్రిగా చేశారాయన. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అధ్యక్షుడిగానూ పని చేశారు. రాష్ట్రం విడిపోతే తప్పేంటి.? అని అన్నదీ ఆయనే. విడిపోతే, విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందని కూడా అప్పట్లో చెప్పారు.
కానీ, ఇప్పుడాయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయన కీలక మంత్రి కూడా. అందుకే, మాట మారింది. అమరావతిని ఎడారిగా, ముంపు ప్రాంతంగా బొత్స సత్యనారాయణ అభివర్ణిస్తూ వచ్చారు.
అప్పట్లో విజయవాడే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. అని చెప్పిన బొత్స, ఇప్పుడు మూడు రాజధానులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి.. అంటున్నారు. సరే, రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని అమరావతి వుండాలా.? మూడు రాజధానులు వుండాలా.? అన్నది వేరే చర్చ. అసలంటూ మూడు రాజధానులు లేకపోతే అభివృద్ధి అసాధ్యమన్నట్టుగా బొత్స మాట్లాడితే ఎలా.?
పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు.. కుండబద్దలుగొట్టేస్తున్నారు. దేశానికి ఒకే ఒక్క రాజధాని వుంది. పొరుగునున్న తెలంగాణ కావొచ్చు, ఒరిస్సా కావొచ్చు.. తమిళనాడు కావొచ్చు.. ఒకే ఒక్క రాజధానిని కలిగి వున్నాయి. అక్కడ అభివృద్ధికి లేని ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకు వస్తుందిట.?
అయినా, రాజధానులతోనే అభివృద్ధి అంటే, ఇప్పుడున్న పదమూడు జిల్లాలకు పదమూడు రాజధానులుంటే ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుందేమో. కాదు కాదు, కొత్తగా 26 జిల్లాలు కాబోతున్నాయి కాబట్టి 26 జిల్లాలు పెడితే బావుంటుందేమో.!