ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతోందో అందరికీ కనిపిస్తోంది.చంద్రబాబు హయాంలో అయినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం.. మిగతా రాష్ట్రాలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది తప్ప.. అభివృద్ధిలో తనదైన ప్రత్యేకతను చాటుకోలేకపోతోంది. దానికి ప్రధాన కారణం సరైన రాజధాని లేకపోవడం. చంద్రబాబు హయాంలో అమరావతి ఓ పబ్లిసిటీ స్టంటుగా మారిపోతే, వైఎస్ జగన్ హయాంలో అది మరింత ప్రశ్నార్థకమయ్యింది. సరైన రాజధాని లేని రాష్ట్రం ఎలా అభివృద్ధిలో పురోగమించగలుగుతుంది.? తాజాగా నీతి అయోగ్, రాష్ట్రం మీద ప్రశంసలు కురిపించేసిందంటూ ప్రచారం జరుగుతోంది.
నీతి అయోగ్ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ తర్వాత అట్నుంచి వచ్చిన స్పందన అది. చంద్రబాబు హయాంలోనూ ఇలాంటివి చాలానే జరిగాయి. కేంద్రం ఆయా విభాగాల్లో రాష్ట్రాన్ని ప్రశంసించడంతోనే సరిపెట్టింది. అలా ప్రశంసించేస్తే, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల అంశం సైడ్ ట్రాక్ అయిపోతుందన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది.
అప్పుడు జరిగిందీ అదే.. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించాలి. అంటే, ఆ రాజధాని కోసం కేంద్రం నిధులు ఇస్తే, అవి సద్వినియోగమయ్యాయో లేదో కూడా కేంద్రమే బాధ్యతగా తెలుసుకోవాలి. కానీ, అలా జరగలేదు. ప్రస్తుతం రాష్ట్రానికి రాజధాని అమరావతి అయినా, మరో రెండు రాజధానుల్ని అదనంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో, మొదటి రాజధాని అమరావతిని సైతం లైట్ తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.
ఇలా ఇంకెన్నాళ్ళు.? కేంద్రం, మూడు రాజధానుల విషయమై రాష్ట్రానిదే తుది నిర్ణయం అని న్యాయస్థానాల్లోనూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ఆ మూడు రాజధానుల విషయంలో రాష్ట్రానికి సహకరించాలి కదా.? అలాక్కూడా చేయడంలేదు.ఎలా చూసినా, రాష్ట్రం విషయంలో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నీతి అయోగ్, తన పరిధిలో రాష్ట్రానికి చేయాల్సింది చాలా వున్నా.. అదీ చేయడంలేదు. చేయాల్సిన సాయం చేయకుండా ప్రశంసలేంటి.? ఆ ప్రశంసలతో రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం వుంటుందా.?