ఒకచోట పదిమంది పాత స్నేహితులు కలిసినప్పుడు అందులోకి కొత్తగా వచ్చిన మిత్రునికి ఎక్కడలేని విలువ ఇస్తున్నప్పుడు మిగతావారు అలగడం.. ముందు వచ్చిన చెవుల కంటే, వెనుక వచ్చిన కొమ్ములు వాడి అంటూ సైటర్స్ వేయడం తరచుగా చూస్తుంటాం.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాయకుల పరిస్దితి కూడా ఇలాగే ఉందట.. ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్లుగా ఇప్పుడు వలసగా వచ్చిన టీడీపీ నాయకులకు దక్కే మర్యాద, అధికారం ముందు పార్టీ మొదలైనప్పటి నుండి గబ్బిలంలా పట్టుకున్న వారు వెలవెలపోతున్నారట.. అంటే టీడీపీ నుండి వైసీపీలోకి జంప్ అయ్యిన వారు చేస్తున్న హంగామాతో వైసీపీ నాయకులకు విలువ లేకుండా పోతుందంటున్నారు..
ఈ గోడ దూకుళ్ళ వ్యవహారం వైసీపీలో కొత్త రచ్చకు తెరతీస్తుందట.. అదేంటో తెలుసుకుంటే వైసీపీలో ఉన్న కొందరు సీనియర్ నాయకులు వైసీపీలో చేరినపుడు వైఎస్ జగన్ వట్టి ఎంపీ మాత్రమే. తర్వాత ఆయన జైలుకి వెళ్లిన సమయంలో నాడు అధికారంలో టీడీపీని ఎదిరించి నిలబడ్డారు. ఇక 2014లో చంద్రబాబు హయాంలో ఎన్నో వేధింపులను భరించి మరీ అలుపెరగని పోరాటమే చేశారు. తీరా జగన్ ని ముఖ్యమంత్రిగా చూస్తే ఆయన మళ్ళీ వైసీపీ వద్దు, టీడీపీయే ముద్దు అంటున్నారని గాలిపంకా పార్టీ నేతలు వాపోతున్నారట..
ఇకపోతే విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే అక్కడ ఇంచార్జిగా వైసీపీ నేత కోలా గురువులు చక్రం తిప్పుతున్నారు. ఈ నేపధ్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి జంప్ చేసారు. ఆయన రావడంతో కోలా గురువులు కు విలువే లేకుండా పోయిందట. అదీగాక వాసుపల్లి కూడా తన అనుభవాన్ని అంతా రంగరించి మరీ చక్రం తిప్పేస్తున్నారుట. దీంతో గోల్లుమనడం వైసీపీ నేతల వంతు అవుతోందిట. మరో వైపు చూసుకుంటే విశాఖ సిటీలో పశ్చిమ, తూర్పు, ఉత్తర నియోజకవర్గంలో కూడా వైసీపీకి ఎమ్మెల్యేలు లేరు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. దాంతో ఉత్తరంలో గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన మీద ఓడిన కేకే రాజు హవా నడుస్తోంది. ఇపుడు కనుక గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తే రాజు గారి కిరీటం ఎగిరిపోతుందన్న భయంతో ఈ వలసలు వద్దు అని వైసీపీ పెద్దలను వేడుకుంటున్నారుట.
అదే విధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో చూసుకుంటే త్వరలోనే టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వైసీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుండటంతో అప్పటి వరకు హల్చల్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ తల్లడిల్లుతున్నారట. తన వైభోగం ఏం కావాలని ఆయన ఏకంగా హై కమాండ్ ముందే గోడు వెళ్ళబోసుకుంటున్నారుట. ఇలా విశాఖ సిటీలో వైసీపీ నాయకులకు టీడీపీ నాయకుల పోరు మొదలైందంటున్నారు.. ఇలాంటి పరిస్దితుల్లో హై కమాండ్ వారి బాధలను తీర్చకపోతే జీవీఎంసీ ఎన్నికల నాటికి కష్టమేనని అంచనాకు వస్తున్నారు.. ఇలా వైఎస్ జగన్ తీరుకు గోల్లుమంటున్న నాయకుల విషయంలో ఏ తీర్పు ప్రకటిస్తాడో ఏపీ సీయం అనే ఆసక్తి మొదలైందట..