తన కారులో తన మాజీ డ్రైవర్ మృతదేహాంతో, మృతుడి ఇంటికి వెళ్ళిన ఘనుడు ఆ ఎమ్మెల్సీ. దీన్ని వైసీపీ ‘మానవత్వం’గా చెబుతోంది. ఎమ్మెల్సీనే తన మాజీ డ్రైవర్‌ని హత్య చేశాడనే ఆరోపణలు వస్తోంటే, ధైర్యంగా ఆ ఎమ్మెల్సీ బయట తిరుగుతుండడాన్ని వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యానారాయణ (తప్పు చేయలేదు కాబట్టే ఆ ధైర్యం’ అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా వున్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. ఎమ్మెల్సీ తప్పు చేసి వుండొచ్చు, తప్పు చేసి వుండకపోవచ్చు. ఎమ్మెల్సీ చెబుతున్నట్లుగా రోడ్డు ప్రమాదంలోనే ఆయనగారి మాజీ డ్రైవర్ మృతి చెంది వుండొచ్చు. అప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేయాలి.? పోలీసులకు సమాచారం అందించాలి. ఆ తర్వాత పోలీసులే అన్ని వ్యవహారాలూ చూసుకుంటారు.
కొన్నాళ్ళక్రితం ఒంగోలులో ఓ వైసీపీ నేత మీద వైసీపీ నేతలే దాడి చేసిన ఘటన అప్పట్లో పెను దుమారం రేపింది. అప్పటి మంత్రి బాలినేని అనుచరుడ్ని, అదే బాలినేనికి చెందిన మరికొందరు అనుచరులు తీవ్రంగా కొట్టించారు. మోకాళ్ళ మీద కూర్చోబెట్టించి, వీడియో తీసి.. క్షమాపణ చెప్పించారు. ఆ పంచాయితీ, ఆ తర్వాత ముగిసిపోయింది.
అధికార పార్టీ నేతల అరాచకానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ‘తప్పు చేయలేదని నమ్ముతున్నాడు కాబట్టే ధైర్యంగా తిరుగుతున్నాడేమో.. బాధిత కుటుంబం, ఎమ్మెల్సీ మీద ఫిర్యాదు చేయడం ఆలస్యమైంది.. ముందుగా ఫిర్యాదు చేసి వుంటే ఎమ్మెల్సీని పోలీసులు అరెస్టు చేసి వుండేవారేమో..’ అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
ఓ డ్రైవర్ కుటుంబం.. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్సీ మీద పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి వుంటుందా.?