Danger Bells : రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇవి ప్రమాద ఘంటికలే. ఉద్యోగుల్ని వైసీపీ, తెలుగుదేశం పార్టీ వైపు బలవంతంగా పంపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఉద్యోగులు టీడీపీకి హ్యాండిచ్చిన విషయం విదితమే. గంపగుత్తగా ఉద్యోగుల ఓట్లు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఓట్లు వైసీపీకి పడ్డాయంటే, ఉద్యోగుల పట్ల అప్పట్లో చంద్రబాబు సర్కారు వ్యవహరించిన వైఖరే కారణమంటారు రాజకీయ విశ్లేషకులు.
మరిప్పుడు వైసీపీ చేస్తున్నదేంటి.? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లోనే వుండి వుండొచ్చు. కానీ, ‘మీట నొక్కే’ వ్యవహారాలేవీ ఆగడంలేదు. కానీ, ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి వైఎస్ జగన్ సర్కారు, ‘బీద అరుపులు’ అరుస్తోంది. ఇదే ఆరోపణ ఉద్యోగుల నుంచి చాలా గట్టిగా వినిపిస్తుండడంతో, అధికార పార్టీకి చెందిన నేతలు.. ముఖ్యంగా మంత్రులు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.
సలహాదారుల గౌరవ వేతనాలు తగ్గడంలేదు.. సలహాదారుల సంఖ్య తగ్గడంలేదు.. నామినేటెడ్ పోస్టుల పేరుతో చెయ్యకూడనివి కూడా చేసేస్తున్నారు.. సంక్షేమ పథకాల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు విచ్చలవిడిగా చేస్తున్నారు.. వాలంటీర్లంటున్నారు.. ఇంటివద్దకే రేషన్ కోసం వాహనాలంటున్నారు.. వీటన్నిటికీ డబ్లుంటాయ్ గానీ, ఉద్యోగులకైతే డబ్బులు లేవంటారా.? అన్నది ఉద్యోగుల సూటి ప్రశ్న.
ఉద్యోగుల ఆవేదన ఆటోమేటిక్‌గా అధికార వైసీపీకి ఇబ్బందికరమే అవుతుంది రాజకీయంగా. అదెలాగూ ఇప్పుడు ప్రతిపక్షానికి అవకాశంగా మారుతుంది. ‘చంద్రబాబు పాలనలోనే నయ్యం..’ అన్న అభిప్రాయం ఉద్యోగుల్లోనూ, వారి కుటుంబ సభ్యుల్లోనూ వ్యక్తమవుతోంది.
కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేయాల్సి వస్తోందంటూ ఉద్యోగులు నినదిస్తున్న తీరు.. అధికార వైసీపీకి రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ కాబోతోంది. డ్యామేజీ కంట్రోల్ చర్యలకు జగన్ సర్కార్ ఉపక్రమించకపోతే, రాజకీయంగా వైసీపీకి జరిగే నష్టం అంచనాలకు అందనంత ఎక్కువగా వుంటుందనడం నిస్సందేహం.