తెలంగాణలో షర్మిల పార్టీకి అప్పుడే డేంజర్ బెల్స్.!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకి అప్పడే రాజకీయంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.? అంటే.. అవుననే చర్చ జరుగుతోంది. అప్పుడే, పదవుల అమ్మకం.. అనే వివాదం తెరపైకొచ్చింది షర్మిల పార్టీకి సంబంధించి. ఇటీవల తన పార్టీని ప్రకటించిన షర్మిల, పార్టీకి సంబంధించి కొన్ని కమిటీల్ని ఏర్పాటుచేశారు. అయితే, అక్కడే అసలు సమస్య మొదలైంది. ఆశావహులు భంగపడ్డారు. పార్టీ ప్రకటనకు ముందు నుంచీ షర్మిల వెంట తాము నడిచామనీ, ఆమెకు అండగా నిలిచామనీ, అయితే కొందరు.. చివరి నిమిషంలో వచ్చి, షర్మిలను కాకా పట్టి, కీలక పదవులు కొట్టేశారనీ, వారే మిగతా పదవుల్ని అమ్మేసుకున్నారనీ ఆరోపిస్తున్నారు.. పదవులు దక్కించుకోలేకపోయినవారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. ఒకడ్ని తొక్కితేనే.. ఇంకొకడు పైకి లేచేది.

కానీ, కొత్త పార్టీలకు ఇది నిజంగానే పెద్ద తలనొప్పి. అయినా, షర్మిల పార్టీలో.. అంతలా డబ్బులిచ్చి కొనుక్కునే పదవులేముంటాయ్.? అసలు పార్టీలో పదవుల కోసం పోటీ అంటూ వుంటేనే కదా.? అన్నది ఇంకో వాదన. పార్టీలో పదవులకు విపరీతమైన పోటీ వుండందన్న భావన కల్పించడానికి షర్మిల మద్దతుదారులే ఇలాంటి హై డ్రామాకి తెరలేపారా.? అన్న అనుమానాలూ లేకపోలేదు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్లు రకరకాలుగా వుంటాయ్ మరి. అందులో ఇది కూడా ఒకటని సరిపెట్టుకోవాలేమో. ఏదిఏమైనా, ఇలాంటి ప్రచారం షర్మిల పార్టీకి ఖచ్చితంగా చేటు చేస్తుంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో నిలదొక్కుకోవాలంటే, ఈ తరహా ఆరోపణలు పార్టీ మీద అస్సలు రాకూడదు. చిత్రమేంటంటే, ఇంత రచ్చ జరుగుతున్నా, అదంతా ఉత్త ప్రచారమని కొట్టి పారేయడానికి షర్మిల పార్టీ నుంచి ఎవరూ అధికారికంగా ముందుకు రాకపోవడం.