CVL Narasimha Rao: మేమంతా ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్లమే.. కానీ వాళ్లకి అవకాశాలు: సీవీఎల్ నరసింహా రావు

CVL Narasimha Rao: తాను ఎక్కడున్నా ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా గడుపుతానని నటుడు సీవీఎల్ నరసింహా రావు అన్నారు. తనకు రెమ్యునరేషన్ ఎగ్గొట్టడాలు అలాంటివేం ఉండవని ఆయన చెప్పారు. తనకెవరూ బౌన్స్ అయ్యే చెక్కులు కూడా ఇవ్వలేదని, వాళ్లక్కూడా తెలుసు అలాంటి చెక్కులు ఇచ్చినా వేస్ట్.. మంచి డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆని ఆయన నవ్వుతూ చెప్పారు.

ఇకపోతే తన వరకూ వచ్చిపోయిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయని, కానీ దానికి ఆయన ఏ మాత్రమూ ఫీల్ కానని ఆయన తెలిపారు. ఎందుకంటే తాను దేనికైతే అర్హుడినని భావిస్తున్నానో, దానికంటే 10శాతం ఎక్కువే తనకు దక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లోనూ అదే జరుగుతుందని, తన కుటుంబం కూడా తనకు నచ్చినట్టుగా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బతుకు జట్కా బండి షోకి కాన్సెప్ట్ కూడా తన దగ్గరి నుంచే తీసుకున్నారని, దాదాపు 1000 ఎపిసోడ్‌ల వరకు చేశామని ఆయన చెప్పారు.

రాళ్లపల్లి, తనికెళ్ల భరణి ఇంకా కొందరు కలిసి అప్పట్లో ఒక బ్యాచ్‌లా ఉండేవాళ్లమని నరసింహా రావు అన్నారు. మురళీ కళా నిలయం అనే పేరుతో తాము నాటకాలు వేసేవారని, ఆ రోజుల్లో నాటకాల వాళ్లంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లమని ఆయన చెప్పారు. అందులో ముఖ్యంగా కోట శ్రీనివాసరావు, ఎల్‌బి శ్రీరామ్, పిఎల్ నారాయణ, అమరేంద్ర, నూతన్ ప్రసాద్ లాంటి చాలా మంది అప్పట్లో నాటకాలు వేసేవారని ఆయన అన్నారు. అంత మంచి నటులు సినీ ఇండస్ట్రీలో ఉండి కూడా వాళ్లకు అవకాశాలు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.