Crypto Currency : క్రిప్టో కరెన్సీ విషయంలో చాలామందికి చాలా అనుమానాలున్నాయి. నిజానికి, భారతదేశంలో క్రిప్టో కరెన్సీకి అధికారికంగా అనుమతి లేదు. దానర్థం, దేశంలో క్రిప్టో కరెన్సీ మీద నిషేధం వున్నట్లే. అదే సమయంలో, కేంద్రం క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు గనుక, అది నేరపూరితం కాదనే అనుకోవాలేమో.
ఇంత గందరగోళం నడుమ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30 శాతం పన్ను.. అంటూ సంచలన ప్రకటన చేసేశారు. ఇదెక్కడి వింత.? అసలు దేశంలో క్రిప్టో కరెన్సీ ఎప్పుడు చట్టబద్ధమైంది.? చట్టబద్ధత లేని క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై పన్ను ఎలా విధిస్తారు.? అని దేశమంతా జుట్టుపీక్కుంటోంది.
దేశీయ క్రిప్టో కరెన్సీ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారనీ, దానికి సంబంధించి విధి విధానాల్ని త్వరలో రిజర్వు బ్యాంకు ప్రకటిస్తుందంటూ బీజేపీ నేత ఒకరు నిన్న ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
ఇంకా విధి విధానాలు ఖరారు కాకుండానే, క్రిప్టో కరెన్సీ మీద 30 శాతం పన్ను వేయడమేంటి.? అంటూ జనం నెత్తీ నోరూ బాదుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే చాలామంది క్రిప్టో కరెన్సీలో పెట్టబడులు పెట్టేశారు. కొందరికి లాభాలు వచ్చాయి.. కొంతమంది నష్టపోయారు కూడా.
మరి, 30 శాతం పన్ను ఇప్పటికే లావాదేవీలు జరిపినవారికీ విధిస్తారా.? అంటే, విధించే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. అదే జరిగితే, అల్లకల్లోలమే అవుతుంది.