ఈ ఆధునిక కాలంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడో ఒకచోట దొరుకుతుంది. అయితే చాలామంది ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్య పరిష్కారంగా భావిస్తున్నారు. చాలామంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించకుండా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇలాంటి ఘటనే హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాయ్ కాలనీలో చోటు చేసుకుంది. 21 సంవత్సరాల వయస్సు గల సౌజన్య ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సౌజన్య కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్ళటంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో సౌజన్య ఈ అఘాయిత్యానికి పాల్పడింది. సాయంత్రం తల్లితండ్రులు ఇంటికి వచ్చి లోపల చూస్తే సౌజన్య ఉరికి వెలడటం చూసి షాక్ కి గురి అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లీడుకు వచ్చిన కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని వారు పోలీసుల విచారణలో తెలియజేశారు. తమ కూతురి ఆత్మహత్య మీద ఆమె తల్లితండ్రులు అనుమానాలు వ్యక్త పరచడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో విచారణ చేయడం మొదలుపెట్టారు.