Crime News: జల్సాలకు బానిసై దొంగతనాలు.. జైలు పాలైన మారని తీరు..!

Crime News: ప్రస్తుత కాలంలో చాలా మంది యువత ఈజీగా గా డబ్బు సంపాదించడం కోసం అడ్డ దారులు తొక్కుతున్నారు.చదువు మానేసి జల్సాలకు అలవాటు పడిన ఒక వ్యక్తి చెడు దారి లో నడవడం అలవర్చుకున్నాడు. సులువుగా డబ్బు సంపాదించి జల్సా చేయాలి అన్న అతని ఆలోచన అతని దొంగ గా మార్చింది. తాళాలు వేసిన ఇళ్ళల్లో చొరబడి దొంగతనాలు చేసి పెద్ద పెద్ద హోటళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడ్డాడు. గతంలో పోలీసులకు పట్టుబడినా కూడా అతను తీరు మార్చుకోకుండా అవే పనులు చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వివరాలలోకి వెళితే..శ్రీకాంత్ అనే వ్యక్తి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం కి చెందిన వాడు. చదువు మధ్యలో ఆపేసి దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. 2010 నుండి ఉమ్మడి మెదక్ జిల్లా తో పాటు హైదరాబాద్ లోని చాలా ఇళ్ళల్లో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో 2019 డిసెంబర్లో మనోహరబాద్ లో జరిగిన దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. రిమాండ్లో ఉన్న ఇతనికి జైలులో నర్సాపూర్ మండలం వడ్డెర పల్లికి చెందిన బాలరాజు తో పరిచయం ఏర్పడింది. తుఫ్రాన్ లో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు దాదాపుగా ఏడు దొంగతనాలు చేశారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరపగా .. వీరే ఆ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. వారినుండి అధిక మొత్తంలో బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వీరిద్దరూ కలిసి బంగారాన్ని తక్కువ ధరతో మార్కెట్ లో విక్రయిస్తూ సొమ్ము చేసుకొని విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేవారు. శ్రీకాంత్ ప్రవర్తన నచ్చని తల్లిదండ్రులు అతన్ని ఇంటిలోకి రానిచ్చేవారు కాదు. దీనితో అతను బయట హాస్టళ్లు, హోటల్లో ఉంటూ జీవనం సాగించేవాడు. ఇతనికి ఎవరి సపోర్టు లేకున్నా కూడా ఎవరు బెయిల్ ఇచ్చి ఇతన్ని జైల్ నుండి బయటకి తెస్తున్నారు అనేది చర్చనీయాంశమైన అంశం. గతంలో మనోహరాబాద్ చోరీకేసులో విచారణ సమయంలో శ్రీకాంత్ గొంతు కోసుకోవడం గమనార్హం.