అందరికి ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా మహమ్మారి పీడ ఇప్పట్లో విరగడ అయ్యేట్టు కనిపించడం లేదు. కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గుతుంది అనుకునే లోపే కొత్తగా మరో కరోనా మహమ్మారి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చింది. యూకేలో వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు పాకింది. ఈ మహమ్మారికి భయపడి యూకే కొద్ది రోజుల పాటు లాక్‌డౌన్ కూడా ప్రకటించింది. అయితే కొత్త రకం కరోనా అంత ప్రాణాంతకం కాదని శాస్త్రవేత్తలు చెప్పిన నేపథ్యంలో మిగతా దేశాలు అనేక జాగ్రత్తల నడుమ అన్ని కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
సినిమా థియేటర్స్, క్రికెట్ మ్యాచ్‌లు ప్రస్తుతం పలు జాగ్రత్తల నడుమ జరుగుతున్నాయి. క్రికెటర్స్‌ని బయో బబుల్ వాతావరణం నడుమ ఉంచి మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. వారిని ఎవరితో కలిపించే ప్రయత్నం చేయడం లేదు. అయితే బాక్సింగ్ డే టెస్ట్‌లో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌కు హాజరైన ఓ అభిమానికి కరోనా సోకినట్టు మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వెల్లడించింది. మ్యాచ్‌కు వచ్చిన సమయంలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేదని చెప్పిన ఎంసీసీ అతనితోపాటు కలిసి మ్యాచ్ చూసిన వాళ్లు టెస్టులు చేయించుకొని, ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
మ్యాచ్ జరిగే సమయంలో ప్రతి రోజు శానిటైజేషన్ ప్రక్రియతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఎంసీసీ చెబుతుండగా, ఆ రోజు మ్యాచ్‌కు వచ్చిన వారు తప్పని సరిగా పరీక్షలు చేయించుకోవాలని చెబుతుంది. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో మొత్తం 275 శానిటైజింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఘటన తర్వాత సిడ్నీ టెస్ట్‌కు వచ్చే ప్రతి అభిమాని కచ్చితంగా మాస్క్ వేసుకోవాల్సిందేనన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవి పాటించకపోతే వెయ్యి డాలర్ల జరిమాని విధిస్తాం అంటున్నారు.