YS Jagan : సీపీఎస్, వైఎస్ జగన్ సరిదిద్దుకోలేని తప్పిదం.!

YS Jagan : ‘ఎన్నికలకు ముందర ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్ళి మైక్ పట్టుకుని ఏదన్నా హామీని ప్రజల్ని ఉద్దేశించి ఇస్తే, దాన్ని నెరవేర్చాలి. నెరవేర్చని పక్షంలో అలాంటి నాయకుల్ని కాలర్ పట్టుకుని జనం నిలదీయాలి. అలా నిలదీసినప్పుడే, ప్రభుత్వాన్ని నడిపేవారు సరిగ్గా పని చేస్తారు..’ అంటూ ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీపీఎస్ రద్దు విషయంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, పై వీడియోని మిక్స్ చేసి వదులుతున్నారు నెటిజనం. విపక్షాలకు చెందిన నెటిజన్లు ఈ వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వీటిపై సమాధానం చెప్పలేని పరిస్థితి అధికార వైసీపీది.

తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చిన వైనాన్నీ, జనసేన పార్టీ పలు సందర్భాల్లో మాటల్ని మార్చిన విషయాన్నీ పేర్కొంటుండడం ద్వారా ఎదురుదాడికి దిగేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నా, వైఎస్ జగన్ చేసిన, ‘కాలర్ పట్టుకుని నిలదీయాలి’ అన్న మాటలు మాత్రం అధికార పార్టీని ఇబ్బంది పెడుతూనే వున్నాయి.

పీఆర్సీ వివాదం నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశం కూడా చర్చనీయాంశమవుతోంది. సీపీఎస్ రద్దు వ్యవహారం చాలా ఇబ్బందులతో కూడుకున్నదనీ, అప్పట్లో అవగాహన లేకుండా వైఎస్ జగన్ మాట్లాడారని మొన్నామధ్య ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విషయం విదితమే.

అప్పట్లో ఆ విషయాన్ని అంతా లైట్ తీసుకున్నారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగుల్ని సంతృప్తి పరిస్తే, పీపీఎస్ విషయంలో ఉద్యోగులు పెద్దగా పట్టుబట్టేవారు కాదేమో. ఎప్పుడైతే పీఆర్సీ వివాదం ముదిరి పాకాన పడిందో, ఉద్యోగులకు సీపీఎస్ అంశం ఓ అస్త్రంలా మారుతోంది. ఎలా చూసినా ఇదొక చారిత్ర తప్పిదంలా మారిపోయింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.