ఏం, కమ్యూనిస్టులైతే మాత్రం దైవ భక్తి వుండకూడదా.? అని అమాయకత్వంతో ప్రశ్నించేశారు ‘చికెన్ నారాయణ’. గతంలో, గాంధీ జయంతి నాడు చికెన్ ఆరగించి వివాదాల్లోకెక్కిన ‘సీపీఐ నారాయణ’, ఆ తర్వాతి నుంచే ‘చికెన్ నారాయణ’గా మారారు. ఆ ఘటన పెను వివాదానికి దారి తీయడంతో, ‘క్షమాపణ’ కూడా చెప్పేశారాయన. తాజాగా, విశాఖలో ఓ స్వామీజీని కలిసి, ఆశీస్సులు పొందిన నారాయణ ఇంకోసారి వివాదాల్లోకెక్కిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై పెను దుమారం రేగింది. ‘నారాయణ కమ్యూనిస్టుల పరువు తీసేశారు..’ అనే చర్చ సోషల్ మీడియాలో కమ్యూనిస్టు పార్టీల మద్దతుదారుల నుంచి వినిపిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై నారాయణ తనదైన స్టయిల్లో స్పందించారు. ‘ఇందులో వింతేముంది.? అనుకోకుండా జరిగిన సమావేశమది. ఆశీర్వాదం తీసుకుంటే తప్పేంటి.? కమ్యూనిస్టులైతే మాత్రం భక్తి వుండదా.?’ అంటూ అమాయకంగా ప్రశ్నించేశారు.
కమ్యూనిస్టులంటేనే, సమాజంలో చైతన్యం తీసుకొచ్చేవారని అర్థం ఒకప్పుడు. ‘మూఢ నమ్మకాలు..’ అంటూ అన్నిటిపైనా యుద్ధం చేసిన చరిత్ర కమ్యూనిస్టులది. కమ్యూనిస్టు భావజాలం వున్న మహిళలు, మెడలో పుస్తెలతాడు కూడా ధరించేవారు కాదు గతంలో. అలాంటిది, ఏకంగా స్వామీజీకి నమస్కరించే స్థాయికి కమ్యూనిస్టు నాయకుడు దిగిజారిపోతే, ఆశ్చర్యపోకుండా ఎలా వుంటుంది కమ్యూనిస్టు సమాజం.? ‘మీరు చెప్పే మాటలకీ, మీరు చేసే పనులకీ పొంతన వుండదు. మీ భావజాలానికి ఆకర్షితులమవడమే మేం చేసిన తప్పు..’ అని నెత్తీనోరూ బాదుకుంటున్నారు కమ్యూనిస్టులమని ఇప్పటిదాకా చెప్పుకున్న చాలామంది. దేవుడికి నమస్కరించడం, నమస్కరించకపోవడమన్నది వేరే చర్చ. స్వామీజీకి నమస్కరించడమేంటి.? పైగా, సదరు స్వామీజీ మీద కుప్పలు తెప్పలుగా ఆరోపణలు వుంటేనూ.! కమ్యూనిస్టు నారాయణ కాస్తా ‘భక్తుడు నారాయణ’గా మారిపోయారనడం తప్పేమీ కాదు కదా.? రాజకీయం.. ఎలాంటి రంగునైనా, ఎలాగైనా మార్చేస్తుంది. ఎరుపు రంగు కూడా అందుకు మినహాయింపేమీ కాదు.